
నిమ్స్‌లో సేవలకు నిరీక్షణ
ఇబ్బంది పడుతున్న రోగులు
ఈనాడు, హైదరాబాద్: పేదల కార్పొరేట్ ఆసుపత్రిగా పేరున్న నిమ్స్‌లో వైద్య సేవల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. లాక్‌డౌన్‌తో ఓపీ రోగుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టినా.. కొద్దిరోజులుగా రద్దీ పెరుగుతోంది. ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరాలజీ, రుమటాలజీ, యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల్లో రద్దీ ఎక్కువ. ఈ విభాగాలకు వచ్చే రోగులు ఓపీ కార్డు తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించాలి. అతి కష్టం మీద ఓపీ కార్డు తీసుకున్నా.. వైద్యులను కలిసేలోపే సమయం అయిపోతుంది. మరుసటి రోజు వచ్చినా.. నిన్న తీసుకున్న కార్డు చెల్లుబాటు కావాలంటే.. కౌంటర్లో స్టాంపు వేయించాలి. దీని కోసం సైతం క్యూ లైన్లో ఉండాలి. సాయంత్రం ఓపీ సాఫీగా సాగినా.. కరోనా రాకతో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన అనంతరం సేవలు ప్రారంభించాలని ఆదేశాలు వచ్చినా పూర్తి స్థాయిలో క్లినిక్‌లు తీయడం లేదు. సాయంత్రం కేవలం నెఫ్రాలజీ విభాగం మాత్రమే వైద్య సేవలందిస్తోంది. ఆన్లైన్ ఓపీ నమోదుపై దృష్టి పెట్టి సేవలను సులభతరం చేయాల్సిన అవసరం ఉంది.
ఆన్లైన్ ఓపీ నమోదును పరిశీలిస్తాం
నిమ్మ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్
ఓపీ రద్దీ ఎక్కువగా కావడంతో కొంత ఆలస్యం అవుతోంది. ఆన్లైన్లో ఓపీ నమోదు చేసుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. సాయంత్రం క్లినిక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. అపాయింట్మెంట్ కోసం నిమ్స్ వెబ్సైట్ లేదా ఆసుపత్రి ల్యాండ్‌లైన్ నంబరుకు ఫోన్ చేయవచ్చు.