
పాత బకాయిలు... అంతేనా!
ఉచిత నీటి సరఫరాతో సందిగ్ధం
రూ.700 కోట్లు వరకు పేరుకున్న వైనం
ఓటీఎస్ ద్వారా రూ.250 కోట్లు వసూలు
ఈనాడు, హైదరాబాద్: నీటి బకాయిల వసూళ్లపై సందిగ్ధత నెలకొంది. ఉచిత నీటి సరఫరా అమల్లోకి రావడమే ఇందుకు కారణం. బకాయిలు దాదాపు రూ.1700 కోట్లు ఉన్నాయి. రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వ విభాగాలకు సంబంధించినవే. వాటికి మినహాయింపు ఉండటంతో పెద్ద ఇబ్బంది లేదు. గృహ నల్లాలకు సంబంధించి ఇంకా రూ.700 కోట్లు రావాల్సి ఉంది. వసూలుకు గతంలో జలమండలి వన్‌టైం సెటిల్మెంట్ పథకం తీసుకురాగా రూ.250 కోట్లు వసూలైంది.
మరో రూ.450 కోట్లు వరకు...
డివిజన్ 1 నుంచి 5 వరకు 60-70 శాతం బకాయిలు పేరుకుపోయాయి. మొత్తం మీద ఇంకా రూ.450 కోట్లు వరకు వసూలు కావాల్సింది. ఉచిత నీటి పథకం అమల్లోకి రావడంతో జీరో బిల్లులు అందిస్తున్నారు. ఇందులో బకాయిలు చూపించడం లేదు. మున్ముందు చేర్చే అవకాశం ఉందా.. అనే విషయంలో స్పష్టత లేదు. పాత బకాయిలు వసూలు కాకపోతే జలమండలి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారనుంది. ఉచిత నీటి సరఫరాకు సంబంధించి నిధులు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.