Published : 04/03/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిర్లక్ష్యపు మంట.. నిధుల తంట!

దవాఖానాల్లో అగ్నిమాపక కేంద్రాలెక్కడ?

ఈనాడు, హైదరాబాద్‌


ఉస్మానియాలో నిర్మించిన షెడ్డు

ప్రభుత్వ దవాఖానాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నపుడు వెంటనే నివారించాలనే లక్ష్యంతో తీసుకున్న చర్యలకు చుక్కెదురైంది. రెండేళ్ల క్రితం ప్రతి ఆసుపత్రిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ ఆసుపత్రులకు మంజూరయ్యాయి. ఒక అగ్నిమాపక శకటంతోపాటు సిబ్బంది ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలనేది లక్ష్యం. నెలలు గడుస్తున్నా...ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఇప్పటికే మూడు ఆసుపత్రుల్లో స్థలం ఎంపిక, షెడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది.

భయపెడుతున్న గత సంఘటనలు..

గతంలో ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో ఎన్‌ఐసీయూ వార్డులో మొత్తం మంటలు వ్యాపించాయి. ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరికొందరు గాయపడ్డారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లో కూడా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏసీలో మంటలు రావడంతో గాంధీలో అగ్గి రాజుకుంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై రోగులను తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో నిప్పు రాజుకొని రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, పేట్లబుర్జు, ఛాతి, మానసిక వైద్యశాల కీలకమైనవి. ఇక్కడ ఓపీలతోపాటు ఇన్‌పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నారు. అర్ధరాత్రి ఏదైనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే నష్టం ఊహించడం కష్టం. అగ్నిమాపక శకటాలు ప్రమాదస్థలికి వచ్చి మంటలు ఆర్పేలోపు రోగుల ప్రాణాలకు ముప్పు తప్పదు. ఈ క్రమంలో ప్రతి దవాఖానా ప్రాంగణంలోనే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. షెడ్ల నిర్మాణం కూడా ఊపందుకుంది. ఉస్మానియాలో ఇప్పటికే ఆ పనులు పూర్తి చేశారు. మిగతా చోట్ల కూడా దాదాపు కొలిక్కి వచ్చాయి. కీలక పనుల్లో అడుగులు ముందుకు పడటం లేదని అంటున్నారు.

షెడ్లతోనే సరా...

పూర్తిస్థాయిలో అగ్నిమాపక యంత్రం అందుబాటులోకి రావాలంటే షెడ్డుతోపాటు ఇతర మౌలిక వసతులు కావారు. కనీసం 40 వేల లీటర్ల సామర్థ్యంతో ఉన్న నీటి సంపు అవసరం. ఈ నీటిని నింపుకొని మంటలు ఆర్పేందుకు వెసులుబాటు ఉంటుంది. అగ్నిమాపక శకటం, ఇతర సిబ్బంది నియామకం ముఖ్యం. ఒక్కో కేంద్రంలో కనీసం పది మంది వరకు షిఫ్ట్‌ల వారీగా సిబ్బంది ఉండాలి. ప్రత్యేక గదులను నిర్మించాలి. అందులో కనీస వసతులు కల్పించాలి. ప్రస్తుతం నిధుల కొరత కారణంగా ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదని అధికారులు వాపోతున్నారు. దీంతో షెడ్డులు నిర్మించి నెలలు గడుస్తున్నా...ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తేవడంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే అగ్నిమాపక కేంద్రాలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని