Published : 21/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కల నెరవేరింది

చార్మినార్‌ జోన్‌లో వికారాబాద్‌


వికారాబాద్‌లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే, తాండూరు: కేంద్ర ప్రభుత్వం కొత్త జోన్లకు ఆమోద ముద్ర వేసి గెజిట్‌ నోటిపికేషన్‌ జారీ చేసింది. ఈ సందర్భంగానే వికారాబాద్‌ను జోగులాంబ నుంచి చార్మినార్‌ జోన్‌లోకి మార్చారు. ఫలితంగా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. భాగ్యనగరంలో విధులు నిర్వహించాలన్న ఉద్యోగుల ఆశ తీరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లాను జోగులాంబ జోన్‌లోకి మార్చారు. ఈ పరిణామం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 9000 మంది ఉద్యోగులను విస్మయానికి గురిచేసింది. నిరుద్యోగులూ కలవరానికి గురయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న జోనల్‌ ఉద్యోగులకు బదిలీలు జరిగితే జోగులాంబ జిల్లాకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందారు. దీంతో నిరుద్యోగులు, ఉద్యోగులు, రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లోకి మార్చాలని కోరుతూ ఆందోళనలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరింది.

2018 హామీ: 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరుకు వచ్చిన ముఖ్య మంత్రి కేసీఆర్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లోకి మార్చుతామని హామీ ఇచ్చారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ ఇదే విషయం చెప్పారు. జిల్లా వాసులకు ఇచ్చిన హామీలో భాగంగా ఇరువురు నేతలు జిల్లాను చార్మినార్‌ జోన్‌లోకి మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నూతన జోన్లకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు నూతన జోనల్‌ విధానంలోనే జరగనున్నాయి. మల్టీజోన్‌ 2లో 6వ జోన్‌ చార్మినార్‌గా ఉంది. ఇందులో వికారాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాలు ఉన్నాయి. పక్క పక్కనే పరిమిత దూరంలో ఉన్న జిల్లాలు కావడంతో ఉద్యోగులకు బదిలీలు జరిగినా పెద్ద సమస్య ఉత్పన్నం కాబోదు. మరో పక్క చార్మినార్‌ జోన్‌లోని జిజిల్లాల్లో జనాభా ఎక్కువ. ఉద్యోగవకాశాలు ఎక్కువగా ఉండడంతో నిరుద్యోగులకు కలిసి వచ్చే అంశం. టీఎస్‌పీఎస్‌సి నుంచి వంద ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వస్తే అందులో దాదాపు 50 శాతం ఉద్యోగాలు కేవలం చార్మినార్‌ జోన్‌లోనే ఉంటాయని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

వికారాబాద్‌టౌన్‌: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఏం కేసీఆర్‌ వికారాబాద్‌ని చార్మినార్‌ జోన్‌లో కలిపారని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని తన నివాసంలో సీఏం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రికి అభినందనలు : వీడీడీఎఫ్‌

జోగులాంబ జోన్‌ నుంచి వికారాబాద్‌ను చార్మినార్‌కు మార్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వికారాబాద్‌ డిస్ట్రిక్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం (వీడీడీఎఫ్‌) ప్రతినిధులు శుభప్రద్‌పటేల్‌, శ్రీనివాస్‌ కృజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రం చేసిన తప్పును కేంద్రం సరిచేసింది: భాజపా

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: జోగులాంబ జోన్‌లో వికారాబాద్‌ జిల్లాను కలిపి రాష్ట్రం చేసిన తప్పును కేంద్ర ప్రభుత్వం చార్మినార్‌లో కలిపి ప్రజలకు న్యాయం చేసిందని భాజపా చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి జనార్దన్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు.

కాంగ్రెస్‌ ఉద్యమం వల్లే: టీఆర్‌ఆర్‌

పరిగి: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమ ఫలితంగానే జోగులాంబ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్పిడి సాధ్యపడిందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్‌ జిల్లా చార్మినార్‌ జోన్‌లో ఉండటం ప్రజల హక్కు అని ఇది రాష్ట్ర ప్రభుత్వ బిక్ష కాదు అని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని