ఆతిథ్య రంగం అతలాకుతలం
logo
Published : 19/06/2021 02:03 IST

ఆతిథ్య రంగం అతలాకుతలం

60శాతం మేరకే వ్యాపారాలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా దెబ్బకు ఆతిథ్య రంగం అతలాకుతలం అవుతోంది. తొలిదశ, రెండో దశ లాక్‌డౌన్‌తో 20శాతం హోటళ్లు మూతపడే స్థితి నెలకొంది. ప్రస్తుతం సాయంత్రం వరకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో 60శాతం మంది మాత్రమే హోటళ్లను నిర్వహిస్తున్నారు. అద్దెలు, నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు, వ్యాపారం సరిగా జరగకపోవడం తదితర కారణాల వల్ల కొందరు మూసివేశారు.

నిర్వహణ భారం.. లాక్‌డౌన్‌లతో హైదరాబాద్‌ నగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి తారుమారైంది. ఇప్పటికే విద్యుత్‌ బిల్లులు, ట్యాక్స్‌లు, నిర్వహణ భారం తడిసి మోపెడు కావడంతో ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారైంది. ధైర్యం చేసి ముందడుగేసినా కరోనా భయంతో వినియోగదారులు వస్తారనే భరోసా లేకుండా పోయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు నడిపేదెలా అన్న ఆందోళనలో నిర్వాహకులు ఉన్నట్లు రెస్టారెంట్స్‌, హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. లీజు కింద తీసుకుంటే కనీసం 2లక్షల అద్దె చెల్లించాల్సిందే. వంటశాలలో గ్రైండర్లు, హీటర్లు, గీజర్లు, ఏసీలు, ఫ్యాన్లు తదితరాలతో విద్యుత్‌ ఛార్జీలు భారీగా వస్తుంటాయి. సిబ్బంది జీతాలు సరేసరి. దీంతో చాలా మంది రిస్క్‌ ఎందుకని వెనకడుగు వేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో మాత్రమే ఆర్డర్లు.. ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా వ్యాపారం సాగుతున్నా అందరికీ అవకాశం ఉండటం లేదు. నగరంలోని 20శాతం హోటళ్లలో మాత్రమే ఈ వ్యాపారం సాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు సడలింపులు ఇచ్చినా వ్యాపారం అంతంతమాత్రంగానే సాగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వేధిస్తున్న సిబ్బంది కొరత...

హోటల్‌ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2లక్షల మంది ఆధారపడి ఉన్నారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో షెఫ్‌లు, వంటచేసేవారు, సహాయకులు, సప్లయర్లుగా సుమారు లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసేవారే అధికం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, అసోం, మణిపూర్‌, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాల నుంచి వంట మాస్టర్లు, క్లీనర్లు, బేరర్లు వరకు.. ఒక్కో రెస్టారెంట్‌లో సుమారు 30మందికి తగ్గకుండా పని చేస్తుంటారు. లాక్‌డౌన్‌-2తో ఇంటికెళ్లిన వారు థర్డ్‌వేవ్‌ వల్ల మరోసారి లాక్‌డౌన్‌ పెడితే మళ్లీ ఇబ్బందులు ఎదురవుతాయంటూ ఇప్పుడే వచ్చేందుకు ఇష్టపడటం లేదు.


40శాతం హోటళ్లు తెరవలేదు: వెంకట్‌రెడ్డి, హోటళ్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు

లాక్‌డౌన్‌లతో ఇతర రాష్ట్రాల సిబ్బంది ఇంటి వద్దే ఉండి వ్యవసాయం, ఇతరత్రా పనులు చేసుకుంటున్నారు. సాధారణంగా వర్షాకాలం ఆరంభంలో వారంతా సెలవులు పెట్టి విశ్రాంతి తీసుకున్న అనంతరం నగరానికి వచ్చి పనిలో చేరుతుంటారు. ఈ సారి ముందే లాక్‌డౌన్‌ పెట్టడం, థర్డ్‌వేవ్‌ ఉందని ప్రచారం జరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ పెడితే ఎలా అనే సంశయంలో అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. వ్యాపారం సరిగా లేక 40శాతం హోటళ్లు అసలు ఇప్పటి వరకు తెరవలేదు. 10శాతం హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. చాలా మంది ఫర్నిచర్‌ను, హోటళ్లను అమ్మేయాలని ప్రకటనలు ఇస్తున్నారు.


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని