పాకిస్థాన్‌ క్రికెట్‌.. భాగ్యనగరిలో బెట్టింగ్‌!
logo
Published : 23/06/2021 02:29 IST

పాకిస్థాన్‌ క్రికెట్‌.. భాగ్యనగరిలో బెట్టింగ్‌!

నిజాంపేట్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌లో నిర్వహణ

అయిదుగురి అరెస్ట్‌.. పరారీలో ప్రధాన సూత్రధారి

స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని పరిశీలిస్తున్న సీపీ సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌: దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై ‘ఆన్‌లైన్‌’లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. అయిదుగురిని అరెస్ట్‌ చేసి రూ.20.5 లక్షల నగదు, 33 మొబైల్స్‌, బెట్టింగ్‌ బోర్డు, ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. కేసుకు వివరాలను మంగళవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో మీడియాకు వెల్లడించారు.

ఎక్కడో ఉండి..

ఐపీఎల్‌ మాదిరిగానే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) పేరిట ప్రత్యేక టోర్నీ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లపై కొందరు నిర్వాహకులు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీసులకు సమాచారం అందింది. ఎస్వోటీ బృందాలను రంగంలోకి దించారు. బాచుపల్లి ఠాణా పరిధిలోని నిజాంపేట్‌ బండారీ లేఅవుట్‌లోని పావనీ రెసిడెన్స్‌పై సోమవారం రాత్రి ఆకస్మిక దాడి నిర్వహించి బెట్టింగ్‌ జరుగుతున్నట్లు గుర్తించారు. తూర్పుగోదావరికి చెందిన సోమన్న ప్రధాన సూత్రధారిగా తేల్చారు. ఎక్కడో ఉండి భీమవరానికి చెందిన గుంటూరి సత్యపవన్‌కుమార్‌(32), ఉద్దర సతీష్‌రాజు(41) సాయంతో ఇక్కడ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఇద్దరితో పాటు అక్కడే ఉన్న బెట్టింగ్‌ ఆపరేటర్లు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సీహెచ్‌ త్రినాథ్‌(29), నూజివీడుకు చెందిన నందిపాము భాస్కర్‌(31), పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడువాసి జక్కపూడి ప్రసాద్‌(25)ను అరెస్ట్‌ చేశారు.

హవాలా ద్వారా డబ్బులు... ప్రధాన నిందితుడు సోమన్న లైవ్‌లైన్‌ గురు, క్రికెట్‌ మజ్జా, లోటస్‌, బెట్‌-365, బెట్‌ ఫెయిర్‌ తదితర యాప్‌ల ద్వారా వ్యవహారాలను నడిపిస్తున్నట్లు తేల్చారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మెయిన్‌ లైన్‌ యాక్సెస్‌ను పవన్‌కుమార్‌, సతీష్‌రాజుకు ఇస్తాడు. అతను టీంవ్యూయర్‌ ద్వారా ఎక్కడో ఉండి ఇక్కడ జరిగే బెట్టింగ్‌ తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాడు. బెట్టింగ్‌ బోర్డు నిర్వహణ, బుకీలతో సంప్రదింపులు జరిపేందుకు కమిషన్‌ ప్రాతిపదికన త్రినాథ్‌, భాస్కర్‌, ప్రసాద్‌ను నియమించుకున్నాడు. వీరంతా బెట్టింగ్‌ డబ్బులను ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా స్వీకరిస్తున్నారు. సోమన్న, పవన్‌కుమార్‌ మధ్య లావాదేవీలన్నీ ‘హవాలా’ ద్వారానే జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసులో కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్లు శివప్రసాద్‌ (మాదాపూర్‌ ఎస్వోటీ), కె.నర్సింహారెడ్డి(బాచుపల్లి)ని సీపీ సజ్జనార్‌ ప్రత్యేకంగా అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని