ఏలియన్‌ డెవలపర్స్‌కు రూ.2 లక్షల జరిమానా
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

ఏలియన్‌ డెవలపర్స్‌కు రూ.2 లక్షల జరిమానా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఒప్పందం ప్రకారం సదుపాయాల కల్పనలో విఫలమైన ఏలియన్‌ డెవలపర్స్‌ ప్రై.లిమిటెడ్‌ కంపెనీ రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 ఆదేశించింది. ఏలియన్‌ డెవలపర్స్‌ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలోని చెన్నారంలో వేసిన వెంచర్‌లో సనత్‌నగర్‌కు చెందిన కల్యాణి, అర్జున్‌ దంపతులు 800 గజాల స్థలం కొనుగోలు చేశారు. 2013 ఫిబ్రవరిలో రూ.14 లక్షలు చెల్లించారు. కంపెనీ రిజిస్టర్‌ సేల్‌ డీడ్‌ను అప్పగించింది. ఒప్పందం ప్రకారం వెంచర్‌లో ఐదేళ్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. గడువు ముగిసినా నెరవేర్చలేకపోయింది. దంపతులిద్దరూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. గడువులోగా హామీలను నెరవేర్చకపోతే మొత్తం డబ్బు 10 శాతం వడ్డీతో తిరిగిచ్చేయాలనే నిబంధన ఉందని, ఆ మేరకు నగదు ఇప్పించాలని విన్నవించారు. సేల్‌ డీడ్‌ ఇచ్చాక ఒప్పందం చెల్లదని, ఇది కమిషన్‌ పరిధిలోకి రాదని ప్రతివాదులు వివరణ ఇచ్చారు. వాదనలు, సాక్ష్యాధారాలు విన్న బెంచ్‌ వినియోగదారుల వాదనతో ఏకీభవించింది. సదుపాయాలు కల్పించడం లేదా డబ్బును 10 శాతం వడ్డీతో తిరిగివ్వాలని ఏలియన్‌ డెవలపర్స్‌ సంస్థను ఆదేశించింది. మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.2 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని