తెరాస ప్రభుత్వం ముస్లింలకు చేసిందేమీ లేదు
eenadu telugu news
Updated : 01/08/2021 05:05 IST

తెరాస ప్రభుత్వం ముస్లింలకు చేసిందేమీ లేదు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి


రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న మహమ్మద్‌ అలీషబ్బీర్‌. చిత్రంలో అంజన్‌కుమార్‌యాదవ్‌ తదితరులు

నాంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసింది ఏమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ నమ్మించి మోసం చేశాడని విమర్శించారు. లౌకికవాదిగా తెలంగాణలో ముస్లింలకు పెద్దపీట వేస్తున్నామంటూనే కేంద్రంలోని భాజపా సర్కార్‌కు, ప్రధాని నరేంద్రమోదీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ సిటీ కాంగ్రెస్‌ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఈద్‌ మిలాప్‌ కార్యక్రమం నిర్వహించారు. నాంపల్లి రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి రేవంత్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి మహమ్మద్‌ అలీషబ్బీర్‌, టీపీసీసీ అధికార ప్రతినిది సయ్యద్‌ నిజాముద్దీన్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడ్డాయని గుర్తుచేశారు. ఏడేళ్ల తెలంగాణలో తెరాస ప్రభుత్వం ముస్లింలను అడుగడుగునా నమ్మించి మోసం చేస్తూ వస్తోందని ధ్వజమెత్తారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహమూద్‌అలీకి రాష్ట్ర హోంశాఖ మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ముస్లింల సమస్యలు పరిష్కారం అవుతాయా.. ముస్లింలను సంతృప్తి పరచగలడా అని ప్రశ్నించారు. ముస్లింల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని, 2023లో గోల్కొండ కోటపై పార్టీ జెండా ఎగురవేస్తామని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముస్లింల సమస్యలన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. హైదరాబాద్‌ సిటీ కాంగ్రెస్‌ మైనార్టీ విభాగం ఛైర్మన్‌ సమీర్‌వలీఉల్లా, టీపీసీసీ ఉపాధ్యక్షులు జఫర్‌జావీద్‌, అనిల్‌కుమార్‌యాదవ్‌, ఫెరోజ్‌ఖాన్‌, ఇంతియాజ్‌ పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని