అసలే లోటు.. ఆపై పెన్నుపోటు
eenadu telugu news
Published : 16/09/2021 02:10 IST

అసలే లోటు.. ఆపై పెన్నుపోటు

బల్దియాలో వెయ్యి దాటిన డిప్యుటేషన్‌ ఉద్యోగులు

ఈనాడు, హైదరాబాద్‌

జీహెచ్‌ఎంసీ ఖజానాపై డిప్యుటేషన్‌ ఉద్యోగుల భారం పెరుగుతోంది. ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సంస్థను ఇది మరింత ఇబ్బందికి గురిచేస్తోంది. సొంత ఉద్యోగులు 3వేలు ఉంటే.. వేర్వేరు శాఖల నుంచి బల్దియాకు కొలువు మార్చుకున్న వారి సంఖ్య తాజాగా వెయ్యి దాటింది. అందులో దాదాపు సగం మందికి ఐదేళ్ల సర్వీసు పూర్తవడం గమనార్హం. కొందరు పది నుంచి 12ఏళ్లు కొనసాగుతున్నారు. అది చట్ట విరుద్ధమని జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు ఆందోళన. మరోవైపు పొరుగు శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులతో బల్దియా ఖజానాపై ప్రతి నెలా రూ.30కోట్ల అదనపు భారం పడుతోందని గుర్తుచేస్తున్నారు. కొందరు లంచావతారులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పెరుగుతోన్న ఆర్థిక భారం..

జీహెచ్‌ఎంసీ లేదా ప్రజారోగ్యశాఖకు చెందిన సహాయ ఇంజినీరు జీతం నెలకు రూ.70వేలు ఉంటే.. విద్యుత్తు సంస్థ ఏఈ జీతం రూ.2లక్షలకుపైగా ఉంటుంది. అదేమీ పట్టించుకోకుండా కొందరు ఉన్నతాధికారులు తమ స్వలాభాల కోసం అవసరం లేకున్నా 74 మంది విద్యుత్తు సంస్థ ఏఈలను జీహెచ్‌ఎంసీలో కొనసాగిస్తున్నారని ఉద్యోగ సంఘం తాజాగా మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మికి, కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. స్టేట్‌ ఆడిట్‌ నుంచి వచ్చిన అధికారులు ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తూ..మాతృ సంస్థ నుంచి ఎప్పటికప్పుడు అవసరం లేకున్నా ఉద్యోగులను దిగుమతి చేస్తున్నారని గుర్తుచేసింది. అలాగే సీడీఎంఏ, ప్రజారోగ్యం, డీటీసీపీ, వైద్యం, రెవెన్యూ, ఇతరత్రా ప్రభుత్వ శాఖల అధికారులు జీహెచ్‌ఎంసీకి డిప్యుటేషన్‌పై వచ్ఛి. చట్టం నిర్దేశించిన సమయం పూర్తవగానే మాతృ సంస్థకు వెళ్లడం లేదు. బల్దియా సైతం ఆ విషయాన్ని పట్టించుకోకుండా జీతాలు చెల్లిస్తూనే ఉంది.

దారి మళ్లుతోన్న కోట్లాది రూపాయలు..

‘‘జీహెచ్‌ఎంసీలో డిప్యుటేషన్లు పెరిగిపోయి వింత పరిస్థితి ఉత్పన్నమైంది. ఏటా రూ.5వేల కోట్ల నిధుల వ్యయానికి సంబంధించిన బిల్లులకు ఆడిట్‌ జరుగుతోంది. బల్దియాలోని ఆడిట్‌ విభాగంలో ఉన్నవారంతా దాదాపు స్టేట్‌ ఆడిట్‌ అధికారులే. వాళ్లు చూసిన లెక్కలకు, వారి మాతృ సంస్థకు చెందిన సహోద్యోగులు ఆమోదం వేసి వెళ్తారు. దీనివల్ల ఏటా వందలాది కోట్ల రూపాయల మేర నకిలీ బిల్లులు కంటికి చిక్కకుండా పోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పలు సర్కిళ్ల ఉప కమిషనర్లు మూడు, నాలుగేళ్లుగా ఒకే కుర్చీలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్లకోసారి వారిని బదిలీ చేయాలని, జీహెచ్‌ఎంసీ సొంత ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని