తనిఖీల్లో చిక్కి.. గోదాముల్లో ముక్కి!
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

తనిఖీల్లో చిక్కి.. గోదాముల్లో ముక్కి!

పేదల దరిచేరని రేషన్‌ బియ్యం
 ఏళ్లుగా పట్టించుకోని అధికారులు 
పరిగి గోదాంలో పాడవుతున్న బియ్యం బస్తాలు

న్యూస్‌టుడే, పరిగి: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి చేయూత నివ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేస్తున్నాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పంపిణీ పరిస్థితులపై పర్యవేక్షణ కొరవడటంతో బియ్యం దారి మళ్లుతోంది. అక్కడక్కడా అధికారుల తనిఖీల్లో పట్టుబడిన బియ్యం గోదాములకు చేరుతోంది. వీటిని సద్వినియోగం చేసే విషయాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఫలితంగా ఏళ్లతరబడి బియ్యం గోదాముల్లోనే ముక్కిపోయి చివరకు పందికొక్కుల పాలవుతోంది. ఈ విషయంలో అధికారులు స్పందించి బియ్యం పేదలకు చేరే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

తీరని నష్టం... ఆర్థిక భారం

వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని 20 మండలాల పరిధిలో 588 రేషన్‌ దుకాణాలున్నాయి. 2,41,601 కార్డులు ఉండగా ఆహార భద్రత కార్డులు 2,14,736 ఉండగా 26,826 అంత్యోదయ, 39 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతినెలా 8804.20 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యం ఏళ్లతరబడి నిల్వ చేయడంతో చివరకు పనికి రాకుండా పోయి వాగులు, వంకల్లో పారబోయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పనులతో ప్రభుత్వానికి తీరని నష్టం కలుగుతూ ఆర్థిక భారం పడుతోంది. ఉన్న బియ్యం పాడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే నాణ్యత లేని బియ్యం పంపిణీ అవుతున్నాయని నూకలు విపరీతంగా ఉంటున్నాయని వాపోతున్నారు.


ఏం జరుగుతోందంటే..

పేదల బియ్యం పక్కదారి పడుతున్న సందర్భాల్లో పౌరసరఫరాల అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. బియ్యం స్వాధీనం చేసుకుని వాటిని సమీప గోదాముల్లో ఉంచుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంటున్నా వాటికి రక్షణ లేకుండా పోతోంది. నెలలు కాదు గదా ఏళ్లు గడుస్తున్నా ఎవరూ కన్నెత్తి చూడకపోవడంతో పందికొక్కులు, ఎలుకలకు ఆహారంగా మారుతున్నాయి. వాటికి కళ్లారా చూస్తున్న గోదాము ఇంఛార్జీలు సైతం నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. ఇలా తాండూరులోని సివిల్‌ సప్లయ్‌ గోదాములో 448 క్వింటాళ్లు, కొడంగల్‌ గోదాములో 634 క్వింటాళ్లు, వికారాబాద్‌లో 221 క్వింటాళ్లు మొత్తంగా 1716 క్వింటాళ్ల బియ్యం ముక్కిపోతున్నాయి. కేసుకు సంబంధించి బియ్యం బస్తాలు కావడంతో వాటిని తాకేందుకు కూడా సాహసించడం లేదు. ఉన్నచోటే పాడవడంతో సర్కారు లక్ష్యానికి తీరని అవరోధం కలుగుతోంది.

ఇలా చేస్తే మేలు

* కేసుల్లో పట్టుబడుతున్న బియ్యాన్ని సకాలంలో గోదాముకు తరలించాలి.

* స్టాకు రిజిస్టరులో ఈ బియ్యాన్ని నమోదు చేయాలి.

* మరుసటి నెలకు వీటిని డీలర్ల ద్వారా వినియోగదారులకు పంపిణీ చేయడం.

* అవసరమైనప్పుడు గోదాములో ఉండే స్టాకు నుంచి తిరిగి తీసుకునే వీలు కల్పించడం.

* కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడం.

* పంపిణీపై జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ పెరగాలి

* బియ్యం రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం

- ఎం.వైద్యనాథ్‌, పరిగి, వికారాబాద్‌, మోమిన్‌పేట్‌ గోదాముల ఇన్‌ఛార్జి

గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. తమకు సమాచారం వచ్చే వరకు వాటికి జోలికి వెళ్లడం కుదరదు. తమ ఆధీనంలో ఉన్న మేరకు రక్షణ చర్యలు తీసుకుంటున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని