పండగ రోజు విషాదం
eenadu telugu news
Updated : 17/10/2021 06:42 IST

పండగ రోజు విషాదం

మొయినాబాద్‌, నందిగామ, చేవెళ్ల గ్రామీణం, న్యూస్‌టుడే: పండగ రోజు మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో శుక్రవారం మొత్తం ఐదుగురు దుర్మరణంపాలయ్యారు. మొయినాబాద్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ బి.రాజు వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన పినల్‌సబర్‌(36), అజయ్‌ కొన్నాళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం మొయినాబాద్‌కు వలసవచ్చారు. నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లంబింగ్‌ పనులు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గండిపేట వైపు బయలుదేరారు. రాత్రి 11 గంటల సమయంలో అజీజ్‌నగర్‌ కూడలిలో రహదారి విభాగినిని ఢీకొట్టగా పినల్‌సబర్‌ మృతిచెందాడు. అజయ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వినోద్‌

* ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కారును ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నందిగామ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన వినోద్‌(22) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కొత్తూరు నుంచి షాద్‌నగర్‌ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొంది. వినోద్‌ కారులో ఇరుక్కొని అక్కడికక్కడే మృతిచెందాడు.

మరో ఘటనలో.. ఎలాంటి సిగ్నల్‌ వేయకుండా మలుపు తిరుగుతున్న కారును బైకు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చేవెళ్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పామెనకు చెందిన చాకలిగూడెం ఆంజనేయులు(28) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బైకుపై చేవెళ్లకు వచ్చాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఫారా కళాశాల వద్ద కందవాడ వైపు నుంచి వచ్చిన కారు ఎలాంటి సిగ్నల్‌ వేయకుండా ఆకస్మికంగా మలుపు తీసుకోవడంతో ఆంజనేయులు కారును బలంగా ఢీకొన్నాడు. తీవ్ర గాయాలవడంతో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

అంజనేయులు

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

భువనగిరి గ్రామీణం: దసరా పండుగ రోజు తన స్నేహితుడిని కలిసేందుకూ వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన పట్టణ పరిధిలోని మాసుకుంటలో శుక్రవారం చోటు చేసుకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలం ఆదర్శ నగర్‌కు చెందిన కొడిత్యాల చంద్రశేఖర్‌(26) రాయగిరిలో ఉన్న తన మిత్రుడిని కలిసేందుకు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. మాసుకుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయారు. తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

మరో ప్రమాదంలో వ్యక్తి..

మోటకొండూరు: యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చామాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారంరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై డి.నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్‌ రహీం(40) హైదరాబాద్‌లోని న్యూమలక్‌పేట్‌లో నివసిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లిలో ఆయనకు, సోదరునికి వ్యవసాయక్షేత్రం ఉంది. అక్కడికి ఉదయం వెళ్లి, రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా చామాపూర్‌ శివారులో వాహనానికి కుక్క అడ్డువచ్చింది. ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్నారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని