చెల్లని చెక్కుల కేసుల విచారణలో జాప్యం
eenadu telugu news
Published : 18/10/2021 02:27 IST

చెల్లని చెక్కుల కేసుల విచారణలో జాప్యం

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన భవన సముదాయంలో దాఖలైన చెల్లని చెక్కుల కేసుల పరిస్థితి అయోమయంగా మారింది. గతంలో జిల్లా కోర్టుల భవనంలో ఉన్న మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుల్లో చెల్లని చెక్కుల కేసులు దాఖలైతే.. హస్తినాపురంలోని ప్రత్యేక మెజిస్ట్రేట్‌ కోర్టుకు బదిలీ అయి, అక్కడే విచారణ జరిగేవి. కాగా హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు దశాబ్దం కిందట ఏర్పాటు చేసిన ప్రత్యేక మెజిస్ట్రేట్‌ కోర్టులను 13వ ఫైనాన్స్‌ కమిషన్‌ సూచనలతో గత ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో హస్తినాపురంలోని 12 ప్రత్యేక మెజిస్ట్రేట్‌ కోర్టుల్లో విచారణలో ఉన్న చెల్లని చెక్కుల కేసులన్నీ జిల్లా కోర్టుల భవనంలోని రెగ్యులర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులకు తిరిగి పంపించారు. అప్పటి నుండి నేటి వరకు ఆ కేసులు విచారణకు నోచుకోలేదు. సుమారు ఆరు నెలలుగా సదరు కేసుల వాయిదాలు లేవు. దీతో ఫిర్యాదుదారులు ఆందోళన చెందుతున్నారు. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌(ఎన్‌ఐ యాక్ట్‌)చట్టం ప్రకారం ఆరు మాసాల్లో తీర్పునివ్వాలి. అటువంటిది ఆరు మాసాల నుంచి అసలు విచారణే లేదు. ప్రస్తుతం బదిలీపై వచ్చిన కేసులను రెగ్యులర్‌ కోర్టుల్లో రీ-నంబరింగ్‌ చేస్తున్నట్లు కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి ఇరు పక్షాలకు విచారణ తేదీని నోటీసు ద్వారా చెబుతారా? చరవాణికి సమాచారం పంపిస్తారా అనే విషయంలోనూ స్పష్టత లేదు. సాధారణంగా ప్రత్యేక మెజిస్ట్రేట్‌ కోర్టుల్లో చెల్లని చెక్కుల కేసులు వారం, పది రోజులకోసారి విచారణ జరుగుతుంటే.. చాలా కేసుల్లో కక్షిదారులు మధ్యవర్తుల సహకారంతో రాజీ కుదుర్చుకునే వారు. ప్రస్తుతం విచారణలు పూర్తిగా ఆగిపోయే సరికి కక్షిదారులు రాజీకి కూడా ప్రయత్నించడం లేదు. ఇప్పుడిప్పుడే న్యాయస్థానాల్లో భౌతిక విచారణ ప్రారంభం అవుతుండటంతో చెల్లని చెక్కుల కేసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని