స్వయం ప్రతిపత్తి.. కాసుల కక్కుర్తి!
eenadu telugu news
Published : 20/10/2021 02:58 IST

స్వయం ప్రతిపత్తి.. కాసుల కక్కుర్తి!

రీవాల్యుయేషన్‌ ఫీజుల కోసం కొన్ని అటానమస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల కొత్త ఎత్తుగడ

ఈనాడు, హైదరాబాద్‌

* నగర శివారులోని కుత్బుల్లాపూర్‌ సమీపంలోని అటానమస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల అది. సీఎస్‌ఈ రెండో ఏడాది చదివే విద్యార్థికి 7.3 సీజీపీఏ వచ్చింది. 35 పేపర్లకుగాను 34 పేపర్లలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. వెబ్‌ టెక్నాలజీస్‌లో 70 మార్కులకు 15 వచ్చినట్లు చూపించారు. ఇదే సబ్జెక్టులో ఇంటర్నల్స్‌లో 30కు 29 మార్కులు వచ్చాయి. పరీక్షలో బాగా రాసినప్పటికీ ఫెయిల్‌ అవ్వడంతో సదరు విద్యార్థి కంగుతిన్నాడు. కళాశాల యాజమాన్యాన్ని సంప్రదిస్తే.. రీవాల్యుయేషన్‌ చేయించుకోవాలని ఉచిత సలహా ఇచ్చింది. చేసేది లేక రూ.1400 చెల్లించి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

బాగా చదివేవారు కూడానా!

అటానమస్‌ హోదాను అడ్డం పెట్టుకుని కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు ఆడింది ఆట.. పాడింది పాటగా వ్యవహరిస్తున్నాయి. కాసుల కక్కుర్తితో విద్యార్థులను ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఫెయిల్‌ చేస్తూ రీవాల్యుయేషన్‌లో దండుకుంటున్నాయి. జేఎన్‌టీయూ పరిధిలో 38 వరకు అటానమస్‌ కళాశాలలు ఉన్నాయి. సిలబస్‌ నుంచి పరీక్షల నిర్వహణ వరకు ఆయా కళాశాలలకే అధికారం ఉండడంతో బాగా చదివే విద్యార్థులను సైతం ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించనట్లుగా చూపిస్తున్నాయి.

ఎన్నో అనుమానాలు

నగర శివారులోని ఓ అటానమస్‌ కళాశాలలో సీఎస్‌ఈలో 120 మంది విద్యార్థులకు 35 మంది విద్యార్థులు ఒకే సబ్జెక్టులో అనుత్తీర్ణులైనట్లుగా యాజమాన్యం చూపింది. వీరిలో 30 మంది విద్యార్థులు తాము బాగా రాశామని, అయినప్పటికీ ఫెయిల్‌ అవ్వడంతో ఆందోళనకు గురవుతున్నారు. రూ.వందలు కట్టి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. రీవాల్యుయేషన్‌కు ఏకంగా కళాశాలలు సబ్జెక్టుకు రూ.1400 వరకు వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజుల రూపేణా ఏటా రూ.10-15లక్షలకు ఆదాయం వస్తున్నట్లు తెలిసింది.

జేఎన్‌టీయూ పర్యవేక్షణేదీ?

అటానమస్‌ కళాశాలలు పరీక్షల ఫలితాలు విడుదల చేసే ముందు జేఎన్‌టీయూ నుంచి అనుమతి తీసుకోవాలి. వర్సిటీ పరీక్షల విభాగం నుంచి ఆమోదం పొందిన తర్వాతే ఫలితాలు వెల్లడించాలి. ఫలితాలు వెల్లడించే విషయాన్ని పక్కాగా పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. జేఎన్‌టీయూ పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు భారంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని