‘గాంధీ’లో విద్యుత్తు పునరుద్ధరణ పనులు
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

‘గాంధీ’లో విద్యుత్తు పునరుద్ధరణ పనులు

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: విద్యుత్తు సరఫరా ఆగిపోయి అంధకారంలో ఉన్న గాంధీ ఆసుపత్రిలో పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి సెల్లారులోని విద్యుత్‌ రూమ్‌లో విద్యుదాఘాతం సంభవించి క్రమంగా నాలుగో అంతస్తు వరకు వ్యాపించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతం నార్త్‌ బ్లాక్‌లో ఉండడంతో సౌత్‌బ్లాక్‌లో బుధవారమే విద్యుత్తు సరఫరాను అందించారు. నార్త్‌ బ్లాకులోని వార్డుల్లో ఉన్న రోగులను తరలించారు. గురువారం వరకు కొన్ని అంతస్తుల్లో విద్యుత్‌ను పునరుద్ధరించారు.

45 మంది చీకట్లోనే..: నార్త్‌ బ్లాకు మొదటి అంతస్తులోని ఆర్థోపెడిక్‌ వార్డుల్లో 45 మంది కదలలేని పరిస్థితిలో ఉన్నట్లు ఆసుపత్రి యంత్రాంగం సంఘటన జరిగిన 12 గంటల తర్వాత గుర్తించింది. వారంతా చీకట్లోనే మగ్గి ఉన్నట్లు సమాచారం అందడంతో హుటాహుటిన సిబ్బందిని పంపి ముందుగా కొవ్వొత్తులు వెలిగించారు. వారి బాగోగులు చూసుకున్నారు. ఎట్టకేలకు బుధవారం రాత్రి 11 గంటల వరకు విద్యుత్తు వచ్చేలా చూశారు. కొందరు రోగులు ఇతర వార్డులకు వెళ్లకుండా అడ్మిట్‌ అయిన వార్డుల్లోనే చీకట్లోనైనా ఉంటామని చెప్పడంతో వారికి కరెంట్‌ వచ్చేవరకు మస్కిటో కాయిల్స్‌, కొవ్వొత్తులు అందించామని, వారున్న వార్డుకు కూడా విద్యుత్తు సరఫరాను గురువారం పునరుద్ధరించామని సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. ప్రస్తుతం వేగంగా పనులు జరుగుతున్నాయని, శుక్రవారం సాయంత్రంలోగా నార్త్‌బ్లాక్‌ మొత్తం విద్యుత్తు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని