అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం
eenadu telugu news
Updated : 23/10/2021 06:25 IST

అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతం

కాటేదాన్‌, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్‌లో ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి తప్పి పోయిన బాలుడు సమీపంలోని కుంటలోనే శవమై తేలాడు. వివరాలు రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, ఇన్‌స్పెక్టర్‌ కనకయ్యల కథనం ప్రకారం.. సిరిమల్లె కాలనీలో ఉండే శివశంకర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు, భవన నిర్మాణాల కాంట్రాక్టర్‌. ఆయనకు భార్య అపర్ణ ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు అన్వేష్‌(6) ప్రయివేటు స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇంటినుంచి బయటకెళ్లిన అన్వేష్‌ తిరిగి రాకపోవడంతో బాలుడి అదృశ్యంపై రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోనే ఉన్న కుంటలో శవమై తేలాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బంధుమిత్రులంతా ఘటన స్థలికి చేరుకుని తల్లడిల్లిపోయారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. 

టోయ్‌బైకు తేలేదన్న కోపంతో.. ! 

కుంట ఒడ్డునే బాలుడి ఫ్యాంటు షర్టు, చెప్పులు ఉండటంతో నీళ్లలో దిగి ఈతరాక మునిగి మృతిచెంది వుంటాడని అంతా అనుకుంటున్నా...తండ్రిపై అలకతో చిన్నారి అఘాయిత్యానికి ఒడిగట్టాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్వేష్‌ కొన్నిరోజులుగా బ్యాటరీతో నడిచే టోయ్‌బైకు కావాలని మారాం చేస్తున్నాడు. రెండు రోజుల్లో కొనిస్తానని తండ్రి మాటిచ్చాడు. రెండురోజుల్లో తేలేకపోయారా మూడో రోజే చూడండి నేనేం చేస్తానో అని తల్లితండ్రులను హెచ్చరించాడు. బైకు రావడం ఆలస్యమైంది. మూడోరోజు మధ్యాహ్నం ఇంటినుంచి బయటకెళ్లిన అన్వేష్‌ కుంటలో శవమై తేలాడు. అమ్మానాన్నలపై అలకబూని బట్టలు విప్పి నీటిలో దిగాడా లేదా ఎవరైనా అఘాయిత్యానికి ఒడిగట్టారా అనే కోణాల్లో విచారిస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని