అట్టహాసంగా న్యాయవిజ్ఞాన సదస్సు
eenadu telugu news
Published : 25/10/2021 01:21 IST

అట్టహాసంగా న్యాయవిజ్ఞాన సదస్సు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అక్టోబరు 2నుంచి నవంబరు 14వరకు న్యాయ విజ్ఞాన సదస్సుకు ఉమ్మడి జిల్లా కోర్టు శ్రీకారం చుట్టింది. ఆదివారం కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ శివారులోని ఓ వేడుక మందిరంలో న్యాయ విజ్ఞాన సదస్సు అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్‌, జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌ చంద్రశర్మ హాజరయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉమ్మడి జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, సంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం అంధ యువకులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ వుజ్జాల్‌ భూయాన్‌, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టి.వినోద్‌కుమార్‌, హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి ఎ.అభిషేక్‌రెడ్డి, హైకోర్టు జడ్జి శ్రీదేవి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి న్యాయమూర్తి వై.రేణుక, న్యాయమూర్తులు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, జిల్లాస్థాయి అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శన ప్రారంభం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా నీటిపారుదల, మిషన్‌ భగీరథ, అటవీ, మత్స్య, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, చేనేత జౌళి, గురుకులాలు, డీఆర్‌డీఓ, భరోసా కేంద్రం, ట్రాఫిక్‌ పోలీసులు, తదితర శాఖల అధికారులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ఉమేశ్‌ లలిత్‌ ప్రారంభించి పరిశీలించారు. పాలనాధికారి హనుమంతరావు ఆయా పథకాల అమలు తీరు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని