కరవైన ప్రోత్సాహం..ఉల్లి సాగుపై ప్రభావం
eenadu telugu news
Published : 28/10/2021 00:37 IST

కరవైన ప్రోత్సాహం..ఉల్లి సాగుపై ప్రభావం

మిట్టబాస్పల్లిలో సిద్ధం చేస్తున్న నారు

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ: ఉల్లి రైతులకు విత్తనం దగ్గర్నుంచి విక్రయించే దాకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాగుకు నేలలు అనువుగా ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా ప్రోత్సాహం కరవైంది. ఉద్యాన శాఖలో సిబ్బంది కొరతతో పట్టించుకునే వారు లేకుండాపోయారు. దీంతో పొరుగునున్న మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రవాణా ఖర్చులతో విపణిలో ధరలు అమాంతం పెరుగుతుండటంతో వినియోగదారులపై భారం పడుతోంది.
జిల్లా వ్యాప్తంగా 9.85లక్షల జనాభా నివసిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2.24 కుటుంబాలు ఉన్నాయి. వీరందరి ఇళ్లలో నిత్యం ఉల్లి లేనిదే కూరలు ఉడకవు. తాండూరు, యాలాల, పెద్దేముల్‌, బంట్వారం, కోట్‌పల్లి, ధారూరు, నవాబుపేట, మోమిన్‌పేట, వికారాబాద్‌, బొంరాస్‌పేట, కొడంగల్‌, మర్పల్లి మండలాల్లోని గ్రామాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు. 2వేలకుపైగా ఎకరాల్లో సాగయ్యే పంట ఏటా తగ్గుముఖం పడుతోంది. తాండూరు మండలంలో అత్యధికంగా దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగయ్యేది 600 ఎకరాలకు తగ్గింది. ఐనెల్లి, కోటబాస్పల్లి, మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, జిన్‌గుర్తి, సంకిరెడ్డిపల్లి, ఉద్దండాపూర్‌, మైసమ్మతండా, గుండ్లమడుగుతండా, సిరిగిరిపేట, వీరారెడ్డిపల్లి, రాంపూర్‌, చంద్రవంచ, కరణ్‌కోట, సంగెంకలాన్‌, మల్కాపూర్‌, కొత్లాపూర్‌లో ఇంటింటికి పండించే వారు. ఏడాది అవసరానికి సరిపడా నిల్వ ఉంచుకొని మిగిలినవాటిని విపణిలో విక్రయించే వారు.

రాయితీ నిలిపివేత: ఉద్యాన శాఖ అధికారులు ఏటా అక్టోబరులో యాభై శాతం రాయితీపై విత్తనాలను మండలాలకు తరలించి రైతులకు పంపిణీ చేసే వారు. విత్తన సరఫరాను మూడేళ్లుగా నిలిపివేశారు. దీంతో రైతులు పూర్తి ధరకు కొనుగోలు చేస్తున్నారు. అవి కూడా అందుబాటులో ఉండకపోవడంతో పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లి సమకూర్చుకుంటున్నారు. ఈక్రమంలో కిలో విత్తనాలకు రూ.2వేల నుంచి రూ.2,500 దాకా వెచ్చిస్తున్నారు. రాయితీ లేక,  వందల కిలోమీటర్లు వెళ్లాల్సి రావడం వంటి కారణాలతో దూరమవుతున్నారు. దీనికితోడు ఉద్యాన శాఖలో మండలానికి ఒకరు చొప్పున ఉన్న అధికారులను తొలగించడంతో క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన, సాగు సూచనలు, సలహాలు అందించే వారు కరవయ్యారు.

విక్రయాలకు తప్పని ఇబ్బందులు

ఆరునెలలు శ్రమించి పండించిన ఉల్లిని విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలోని విపణుల్లో కొనుగోళ్లు జరపకపోవడంతో గత్యంతరంలేక రైతులు మలక్‌పేట విపణికి తరలిస్తున్నారు. 150 కిలోమీటర్ల దూరానున్న విపణికి తరలించేందుకు రైతులపై రూ.10వేల నుంచి రూ.20వేల దాకా రవాణా ఛార్జీల భారం పడుతోంది.

ప్రజలపై ధరల భారం

సాగు తగ్గుతుండటంతో దిగుమతులపై ఆధారపడుతున్నారు. టోకు వ్యాపారులు లారీల్లో మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకొని చిల్లర వర్తకులకు విక్రయిస్తున్నారు. ఈక్రమంలో కిలో ధర రూ.30 నుంచి రూ.40దాకా ఉంటోంది. కొనుగోలుదారులపై అధిక ధరల భారం పడుతోంది. స్థానికంగా రైతులను సాగుకు ప్రోత్సహిస్తే దిగుబడుల కొరత ఉండదు. ధర తక్కువ ఉండే ఆస్కారముంటుంది. ఉద్యాన శాఖ అధికారులు దృష్టిసారిస్తే ప్రయోజనముంటుంది.

కర్ణాటక నుంచి తెచ్చుకున్నాం : షకీరాబేగం, మిట్టబాస్పల్లి

ఎకరాకు నాలుగు కిలోల విత్తనాలు అవసరమయ్యాయి. కర్ణాటకలో రూ.6వేలకు విత్తనాలు తెప్పించుకొని నారు సిద్ధం చేశాం. వర్షాలకు నారు దెబ్బతింది. అరకొరగా మిగిలిన నారుతో సాగు చేస్తే దిగుబడులు సగానికి తగ్గే పరిస్థితి ఉంది. 

విత్తనాలు ఇవ్వాలి: వెంకటేష్‌, మల్కాపూర్‌

ఉద్యాన శాఖ ద్వారా రాయితీపై విత్తనాలు అందించాలి. పూర్తి ధరకైనా విత్తనాలు కొందామంటే లభించడం లేదు. చివరకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లక తప్పడం లేదు. వ్యయప్రయాసలకోర్చి విత్తనాలు తెచ్చుకొని పండించినా విక్రయానికి మలక్‌పేటకు వెళ్లాల్సిన పరిస్థితి. సకాలంలో విత్తనాలు సమకూర్చి, పట్టణ విపణుల్లో కొనుగోలుకు ఏర్పాట్లు చేసి సమస్యలను తీరిస్తే ఉత్సాహంగా పండించే వీలుంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని