పంట విక్రయాలకు తంటా
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

పంట విక్రయాలకు తంటా

మార్కెట్‌ నిర్మాణం జాడేది?

మూలుగుతున్న రూ.2 కోట్ల నిధులు

న్యూస్‌టుడే, పాలకుర్తి(రామగుండం)

గోయల్‌వాడ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తింటున్న పందులు(దాచిన చిత్రం)

అష్టకష్టాలు పడి పంటలు పండించిన రైతులకు దిగుబడి సాధించామనే ఆనందం ఎంతసేపూ ఉండటం లేదు. మద్దతు ధర పొందేందుకు సకాలంలో విక్రయానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే తగిన వసతుల్లేక, తేమ, నాణ్యత కోసం ఆరబెడ్తూ అకాల వర్షాలకు పంటలు తడిచి నష్టపోతున్నారు. రామగుండం నియోజవకర్గ పరిధిలో వానాకాలం, యాసంగి సీజనులో సుమారు 30 వేల ఎకరాల్లో వరి, పత్తి, ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ఎస్సారెస్పీ కాల్వల కింద, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టు జలాశయాలతో భూగర్భ జలం పెరిగి పంటల సాగు, దిగుబడి పెరిగింది. స్థానికంగా మార్కెట్‌ లేకపోవటం, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలలేమి, జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి మార్కెట్‌ యార్డు దూరభారం కావడంతో కల్లాల వద్దే దళారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఏర్పాటు చేయడం, ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పనులు ప్రారంభించడంతో సంతోషపడ్డారు. సుమారు రూ.2 కోట్ల నిధులున్నా భవనాలు, గోదాంల నిర్మాణాలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

* మేడిపల్లి, కన్నాల ప్యాక్స్‌ల ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూములు అద్దెకు తీసుకొని ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి రక్షణ ఉండటంలేదు. ఆరబెట్టిన ధాన్యాన్ని పశువులు, పందులు, అకాల వర్షాల నుంచి కాపాడుకోలేకపోతున్నారు.

* పత్తి, మొక్కజొన్న, పసుపు, మిరప ఇతర పంటలను విక్రయించేందుకు 30 కిలోమీటర్ల దూరంలోని పెద్దపల్లి మార్కెట్‌ యార్డుకు వెళ్లాల్సి వస్తోంది. దూరం, రవాణా ఖర్చులు భారమౌతున్నాయి.

* ఉపాధి హామీ కింద మూడు గోదాంల నిర్మాణానికి రూ.40 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఆకెనపల్లిలో పునాది, పిల్లర్ల వరకు నిర్మించారు. పాలకుర్తి, ఎల్కలపల్లిల్లో స్థలాలను కేటాయించలేదు. ఆరేళ్లుగా నిధులు మూలుగుతున్నాయి.

* మార్కెట్‌ కమిటీ భవనాల నిర్మాణాల కోసం అంతర్గాం-పాలకుర్తి రెండు మండలాల మధ్య పుట్నూర్‌ వద్ద సర్వే నంబరు 99లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. 35 గ్రామ పంచాయతీలతోపాటు రామగుండం నగర ప్రాంత గ్రామాల రైతులకు ఈ ప్రదేశం అత్యంత దగ్గరిగా ఉంటోంది.

పుట్నూరులో పనులు ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి(పాతచిత్రం)

* మార్కెట్‌ కమిటీని ప్రకటించాక కార్యాలయాన్ని రామగుండం రాజీవ్‌ రహదారి పక్కన బీ-కార్నర్‌ వద్ద అద్దె గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కొద్ది రోజులు ఈ మార్గం గుండా కొనుగోలు చేసిన ధాన్యం లోడుతో వెళ్లే లారీల నుంచి పన్నులు వసూలు చేశారు. ఇన్‌ఛార్జి కార్యదర్శి, కాంట్రాక్టు పద్ధతిన కంప్యూటర్‌ ఆపరేటర్‌, అటెండరును నియమించారు.

* 2018లో మార్కెటు కమిటీ ఏర్పాటు చేయడంతో పెద్దపల్లి మార్కెట్‌ కమిటీ నుంచి రామగుండం విభజన జరిగింది. రామగుండం మార్కెట్‌ కమిటీ వాటాగా రూ.1.10 కోట్ల నిల్వ చూపారు. 2018 నుంచి 2020 అక్టోబర్‌ 20న కొత్త పాలకవర్గం ఏర్పాటైన కాలానికి సంబంధించి రూ.50 లక్షల నిధులు నిల్వ ఉన్నాయి. గత వర్షాకాలం పంట విక్రయించగా రూ.80 లక్షలు వచ్చాయి. ఈ ఏడాది యాసంగి పంట విక్రయ డబ్బులు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం సుమారు రూ.2 కోట్లకుపైగా నిధులు ఉన్నాయి.

* ఈ యేడాది జనవరి 18న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాలకుర్తి మండలం పుట్నూర్‌లో మార్కెట్‌ కమిటీ భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పనులు మాత్రం జరగడంలేదు.

* 2 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గోదాం నిర్మాణానికి రూ.1.75 కోట్లు, ప్రహరీ, ద్వారాలు, స్వాగత తోరణం రూ.1.60 కోట్లు, నేల చదును, అంతర్గత రోడ్లు రూ.68 లక్షలు, కార్యాలయం భవనం రూ.60 లక్షలు, మరుగుదొడ్లు, మూత్రశాలలకు రూ.15 లక్షలు, తాగునీటి బోరువెల్‌కు రూ.7.50 లక్షలతో అంచనాలు రూపొందించారు.

ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించాం

-అల్లం రాజయ్య, ఛైర్మన్‌, రామగుండం మార్కెట్‌ కమిటీ

మార్కెట్‌ కమిటీ భవన నిర్మాణాలకు సంబంధించి అంచనాల నివేదికను సమర్పించి రూ.4.85 కోట్ల నిధులు మంజూరు చేయాలని మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను కోరాం. కరోనా కారణంగా జాప్యం జరుగుతోంది. త్వరలో మరోసారి అందరినీ కలిసి నిధుల మంజూరుకు ప్రయత్నిస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని