మత్స్య సంపదలో అగ్రగామిగా తెలంగాణ
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

మత్స్య సంపదలో అగ్రగామిగా తెలంగాణ

చేప పిల్లలు వదులుతున్న మంత్రి ఈశ్వర్‌, కలెక్టర్‌ రవి, జడ్పీఛైర్‌పర్సన్‌ వసంత

వెల్గటూరు, న్యూస్‌టుడే : కాళేశ్వరం జలాశయం, మిషన్‌ కాకతీయతో చెరువులు జలకళ సంతరించుకోవడంతో మత్స్య సంపద పెంపులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. గురువారం కోటిలింగాల గోదావరి తీరంలోని ఎల్లంపల్లి నిల్వ నీటిలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 6.10 లక్షల చేప పిల్లలు మంజూరు కాగా గురువారం 1.58 లక్షల పిల్లలను జడ్పీ ఛైర్మన్‌ దావ వసంత, కలెక్టర్‌ రవిలతో కలిసి చేప పిల్లలను నీటిలో వదిలారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 250 కి.మీ పొడవునా 19 రిజర్వాయర్లు, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునర్నిర్మాణం జరగడంతో జలకళ సంతరించుకుందన్నారు. విభిన్న రకాల చేపలతో పాటు రొయ్యల పెంపకం సమృద్ధిగా ఉందన్నారు. ఈ ఏడాది జగిత్యాల జిల్లాలో 690 చెరువుల్లో మత్స్యకారుల సొసైటీలకు రూ.2 కోట్ల వ్యయంతో 1.46 కోట్ల చేప పిల్లలు మంజూరయ్యాయని తెలిపారు. చేపలు సరిగా దొరకని పరిస్థితి నుంచి గతేడాది 2.34 లక్షల టన్నుల చేప పిల్లలు ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. రాబోయే రోజుల్లో విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ప్రగతి సాధించనుందన్నారు. అనంతరం కోటిలింగాలలో పర్యాటకంగా అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్‌తో సమీక్షించారు. వెల్గటూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పలువురు సంచార కుటుంబాలు తమకు కాళేశ్వరం లింక్‌-2 పనుల పేలుళ్ల ప్రభావంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి ఈశ్వర్‌కు మొర పెట్టుకున్నారు. సురక్షిత ప్రదేశాల్లో పునరావాసం కల్పించాలని కలెక్టర్‌, తహసీల్దారులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, కలెక్టర్‌ రవి, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ హరిచరణ్‌రావు, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు బి.సుధారాణి, మత్స్యశాఖ ఏడీ నరసింహారావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎలేటి క్రిష్ణారెడ్డి, సహకార సంఘాల అధ్యక్షులు రత్నాకర్‌, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని