లాక్ డౌన్ ఎత్తేసినా నిబంధనలు పాటించాల్సిందే
logo
Published : 20/06/2021 03:41 IST

లాక్ డౌన్ ఎత్తేసినా నిబంధనలు పాటించాల్సిందే

నేటి నుంచి యథాతథ పరిస్థితి

 మూడో ముప్పునకు మేల్కొలుపు కావాలి 

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే

ట్టకేలకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తేశారు. దీంతో ఇన్నాళ్లూ ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన జిల్లా ప్రజలకు ఉపశమనం లభించినట్లైంది. ఈ కాలంలో పాజిటివ్‌ కేసులు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. శనివారం జరిగిన మంత్రివర్గ భేటీలో సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ సంపూర్ణంగా ఎత్తేయడంతో అందరికీ ఉపశమనం లభించినట్లైంది. దీంతో ఆదివారం నుంచి యథాతథ పరిస్థితి కొనసాగనుంది. లాక్‌డౌన్‌ సమయంలో విధించిన నిబంధనలన్నీ రద్దవుతాయని స్పష్టం చేసినా శుభకార్యాలు వంటి వాటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మూడో ముప్పు రాకముందే జనం మేల్కొని స్వీయ జాగ్రత్తలు పాటిస్తే మేలని సర్వత్రా సూచిస్తున్నారు.

39 రోజులు పకడ్బందీగా..

మే 12న ప్రారంభమైన లాక్‌డౌన్‌ జూన్‌ 19 వరకు మూడు దఫాలుగా మొత్తం 36 రోజులపాటు నిరాటంకంగా సాగింది. మొదటి పది రోజులు సడలింపు సమయం తక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం 8 గంటల సడలింపు ఇవ్వడంతో కొద్దిగా ఉపశమనం లభించింది. కొంతమేర కేసులు తగ్గుముఖం పట్టడంతో పగలు మొత్తం సడలింపు ఇచ్చారు. చివరి పది రోజులు రాత్రిపూట మాత్రమే లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. దుకాణాలు మాత్రం 5 గంటలకే మూత వేయాల్సి రావడంతో వాటి యజమానులు కొంత ఇబ్బంది పడ్డారు.

22 వేల కేసులు.. 6 వేల వాహనాలు

మొత్తం 36 రోజులపాటు సాగిన లాక్‌డౌన్‌ కాలంలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝులిపించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 22 కేసులు నమోదయ్యాయి. దాదాపు 6 వేల వరకు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై క్రిమినల్‌ కేసులతోపాటు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద కేసులు నమోదు చేశారు. జరిమానాలు చెల్లించి తమ వాహనాలను తాత్కాలికంగా తీసుకువెళ్లినా అనంతరం వారు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

అతిక్రమిస్తే జరిమానాలు

లాక్‌డౌన్‌ ఎత్తేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు అధికారులు అన్‌లాక్‌ మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటిస్తూ శానిటైజర్‌ వాడాల్సిందేనన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని వివరించారు. మాస్కు ధరించకుంటే రూ.1000 జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. కార్యాలయాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు వంటి రద్దీ ప్రదేశాల్లో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. లేకుంటే నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.


సహకరించిన ప్రజలకు సీపీ ధన్యవాదాలు

లాక్‌డౌన్‌కు జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు సహకరించినందుకు సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వచ్చినవారికి అవగాహన కల్పించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని, ఎలాంటి అత్యవసరం లేకుండా అనవసరంగా బయటకు వచ్చిన వారిపై మాత్రం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది సైతం ఆందోళన చెందకుండా విధులు నిర్వహించడంతోనే జిల్లాలో లాక్‌డౌన్‌ విజయవంతమైందని సీపీ అన్నారు.


ఆ రెండు నియోజకవర్గాల్లోనూ తొలగింపు

కొవిడ్‌ కేసుల తీవ్రత అధికంగా ఉండడంతో జిల్లాలోని మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మిగతా ప్రదేశాల్లో మాదిరిగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వలేదు. మధ్యాహ్నం రెండు గంటల నుంచే లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఆయా ప్రాంతాల్లోనూ కరోనా కేసులు అదుపులోకి రావడం, ఈ జిల్లా మేరకు వైద్యశాఖ నివేదిక ఇవ్వడంతో అక్కడ కూడా పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తేశారు. ఇక్కడి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ మళ్లీ కేసులు పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని