
మూడిళ్లలో చోరీ
75 తులాల వెండి, రూ.40 వేల నగదు అపహరణ
వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌టీం సభ్యులు
శిరివెళ్ల, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని ఇక్రా పాఠశాల సమీపంలోని రెండు, నూరానిపేటలోని ఒక ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం శిరువెళ్లలోని ఇక్రా పాఠశాల సమీపంలో ఉన్న షఫివుల్లా ఇంట్లో రూ.28 వేల నగదు, 20 తులాలు వెండి వస్తువులు, ఓ జత బంగారం కమ్మలు, ఖలందర్ ఇంట్లో 50 తులాల వెండి వస్తువులు, రూ.12 వేల నగదు, అలాగే నూరానిపేటకు చెందిన మొహిద్దీన్ ఇంట్లో 5 తులాల వెండి వస్తువులను ఎవరూలేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. మూడిళ్లలో ఇంటి తాళాలను తొలగించి 75 తులాల వెండి, రూ.40 వేల నగదును చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, కృష్ణమూర్తి తెలిపారు.
చర్చిలో నగదు.. జూపాడుబంగ్లా, న్యూస్‌టుడే : చర్చిలో నగదు చోరీ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపాలు తెలిపారు. తంగడంచలో ఉన్న తెలుగు బాప్టిస్టు చర్చిలో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి హుండీలను పగలగొట్టి అందులో రూ.1,15,000 ఉన్న నగదును ఎత్తుకెళ్లారని, ఉదయం నాలుగు గంటల సమయంలో చర్చి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గుర్తించిన ఏసయ్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేశామని తెలిపారు.