
ఈ అమ్మ కష్టం.. ఆ సంకెళ్లకే తెలుసు!
రైతు కుటుంబానికి దీనస్థితి
నాగేష్తో తల్లి నాగమ్మ
ఆదోని సాంస్కృతికం, న్యూస్‌టుడే: గోరుముద్దలు కలిపి కొడుకు నోటికందించే తల్లి, అదే చేత్తో అతనికి సంకెళ్లు వేసేందుకు సిద్ధమయ్యిందంటే ఆమెదెంత కఠినమైన మనసో అనిపిస్తుంది. అయితే ఆ అమ్మ మనసు పడుతున్న క్షోభ ఆ సంకెళ్లకే తెలుసు. ఆ బాధ తన హృదయానికే తెలుసు. దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికి చెందిన బాలన్న, నాగమ్మ దంపతులకు నలుగురు కుమారులు. బాలన్న మృతి చెందాక వారి బాధ్యత నాగమ్మపై పడింది. తనకున్న మూడు ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆమె కుమారుల్లో నాగేష్, తిప్పన్నలకు మతిస్థిమితం సరిగా లేదు. దీంతో వారి బాధ్యత ఆమెకు తలకు మించిన భారంగా మారింది. మిగిలిన ఇద్దరు కుమారులు బెంగళూరుకు వలస పోగా, మతిస్థిమితం లేని కుమారులను చూసుకుంటూ ఆమె ఇంటి వద్దే ఉండేవారు. ఈ పరిస్థితుల్లో పొలం సాగు ఇబ్బందిగా మారి జీవనం కష్టమైంది. దీంతో తిప్పన్నను ఇంట్లోనే ఉంచి, నాగేష్‌ను వెంటబెట్టుకుని ఆదోని పట్టణంలో భిక్షాటన చేస్తూ వారిని పోషించుకుంటున్నారు. మతిస్థిమితం లేని కుమారులకు, వితంతువైన తనకూ ప్రభుత్వం తరఫున పింఛను రావడం లేదని, దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేదని ఆమె వాపోయారు.