నలుదిశలా కష్టాలే!
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

నలుదిశలా కష్టాలే!

మహిళలపై తగ్గని దాడులు

గస్తీ వాహనాల నిర్వహణ అంతంతే

నగరంలోని దిశా మహిళా పోలీసుస్టేషన్‌

మహిళలకు భద్రత కల్పించి నేరాలు నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మహిళలపై దారుణాలు ఆగడం లేదు. పలు ప్రాంతాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఫలితంగా వారు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో 2020 మార్చి 8న దిశా మహిళా పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు, నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, 19 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు. ప్రస్తుతం డీఎస్పీగా వెంకట్రామయ్య ఉన్నారు. ఇప్పటివరకు ఈ ఠాణాకు భార్యాభర్తలకు సంబంధించిన ఫిర్యాదులు 1,372 రాగా 1,191 జంటల మధ్య రాజీ కుదుర్చారు. 181 జంటలు మధ్య రాజీకి రాకపోవడంతో వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.

ప్రతి సబ్‌ డివిజన్‌ కేంద్రంలో అవసరం

కర్నూలు మహిళా పోలీసుస్టేషన్‌ భవనాన్ని ఆధునికీకరించి దిశా పోలీసుస్టేషన్‌గా మార్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా దిశా చట్టం అమలులోకి రాకపోవటంతో సార్థకత చేకూరటం లేదు. కేటాయించిన కొన్ని అదనపు బాధ్యతలు మినహాయిస్తే గతంలో కర్నూలు మహిళా పోలీసుస్టేషన్‌ తరహాలోనే భార్యాభర్తల మధ్య వివాదాలకు సంబంధించి కౌన్సిలింగ్‌ ద్వారా రాజీ చేస్తున్నారు. జిల్లాలో ఏకైక దిశా పోలీసుస్టేషన్‌ కావటంతో ఇతర ప్రాంతాల మహిళలకు దూరాభారంగా మారింది. దీనికి ప్రతి సబ్‌ డివిజన్‌ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా..

పలు పోలీసుస్టేషన్లలో మహిళల ఫిర్యాదులు సరిగా స్వీకరించకపోవటంతో జిల్లా కేంద్రంలో నిర్వహించే ఎస్పీ స్పందన కార్యక్రమాన్ని ఆశ్రయిస్తున్నారు. దిశా గస్తీ వాహనాలకు ప్రతి నెలా కేటాయించే 20 లీటర్ల పెట్రోలు ఏ మాత్రం సరిపోవటం లేదు. దీంతో ఠాణాలకు ఇవి భారంగా మారాయి. మహిళా హెల్ప్‌ డెస్క్‌, దిశా గస్తీ తదితరాలు ప్రభావం చూపడం లేదు. జిల్లాలో మహిళలపై దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. హత్యలు, వేధింపులు ఇతరత్రా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే బాధితుల సంఖ్య అంతకు రెట్టింపు ఉంది. పత్తికొండకు చెందిన ఓ మహిళ న్యాయం కోసం ఏకంగా జిల్లా పోలీసు కార్యాలయం వద్ద క్రిమిసంహారక మందు తాగిన ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ.

పోక్సో చట్టం కింద 2018లో 24 కేసులు, 2019లో 40, 2020లో 58, 2021 (జూన్‌)లో 21 కేసులు నమోదయ్యాయి.

జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు

దిశా మహిళా పోలీసుస్టేషన్‌ ఆధ్వర్యంలో మహిళలను చైతన్యపరిచేలా జిల్లావ్యాప్తంగా 2,598 అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆపదలో ఆదుకునే దిశా యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 5.52 లక్షల మంది మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇందులో 1,119 సచివాలయాల మహిళా పోలీసుల కృషి ఉంది. దిశా యాప్‌ ద్వారా 231 మంది బాధితులు సంప్రదించారు.

● బాలలపై లైంగిక దాడులకు సంబంధించి వేర్వేరు పోలీసుస్టేషన్లలో పోక్సో చట్టం కింద 43 కేసులు నమోదవగా దిశా మహిళా పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. పలు కేసులపై దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రాలు దాఖలు చేశారు.

● జిల్లావ్యాప్తంగా 60 పోలీసుస్టేషన్లకు 60 దిశా ప్రత్యేక ద్విచక్ర వాహనాలు కేటాయించారు. కళాశాలలు, పాఠశాలల వద్ద సిబ్బంది గస్తీ పెట్టి ఆకతాయిలు, పోకిరీలను గుర్తించి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

● ఈ ఏడాది మార్చి 8న జిల్లాలోని 79 పోలీసుస్టేషన్లలో మహిళా ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేక గదిలో మహిళా హెల్ప్‌ డెస్క్‌లను ప్రారంభించారు.

ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు

- వెంకట్రామయ్య, డీఎస్పీ, దిశా మహిళా పోలీసుస్టేషన్‌

దిశా పోలీసుస్టేషన్‌, దిశా యాప్‌ అందుబాటులో వచ్చిన తర్వాత మహిళల్లో చైతన్యం పెరిగింది. మహిళలు తమ సమస్యలపై ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. యాప్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. నంద్యాల సబ్‌డివిజన్‌ పరిధిలో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి దిశ యాప్‌ ద్వారా సమాచారం ఇవ్వగా వెంటనే కాపాడాం. అత్యాచార కేసుల్లో నిందితులకు నిర్భయ, పోక్సో చట్టాల ద్వారా కేసులు నమోదు చేసి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని