Devaragattu: కర్రల సమరానికి సర్వం సిద్ధం.. ఏడుగురు డీఎస్పీలు, 60మంది ఎస్సైలతో భద్రత
eenadu telugu news
Updated : 15/10/2021 09:01 IST

Devaragattu: కర్రల సమరానికి సర్వం సిద్ధం.. ఏడుగురు డీఎస్పీలు, 60మంది ఎస్సైలతో భద్రత

దేవరగట్టులో నేడు బన్ని జైత్రయాత్ర

మాళ మల్లేశ్వరస్వామి ఆలయం

హొళగుంద(హాలహర్వి, ఆలూరు గ్రామీణ), న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర శుక్రవారం అర్ధరాత్రి జరగనుంది. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్‌, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.

ఉత్సవాలకు గట్టిభద్రత

దేవరగట్టులో బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఏడుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 164 మంది ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 322 మంది కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా పోలీసులు, 50 మంది ప్రత్యేక పోలీసు బృంద సభ్యులు, మూడు ప్లాటూన్ల ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బంది, 200 మంది హోంగార్డులను కేటాయించారు. మద్యం నియంత్రించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.

ప్రత్యేక ఏర్పాట్లు..

దేవరగట్టుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. పోలీసు శాఖ అధికారులు వివిధ మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. భక్తులు కదలికలను గుర్తించేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో పాటు రెండు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. కొండపై వాహనాల రాక నిషేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

బన్ని ఉత్సవంలో జరిగే గాయాలకు చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా 20 పడకలతో వైద్యశాలను ఏర్పాటు చేశారు. ఔషధాలు, 108 వాహనాలు అందుబాటులో ఉంచారు. హొళగుంద, ఆలూరు మండలాలకు చెందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు.

ఉత్సవంలో పారిశుద్ధ్యం లోపించకుండా హొళగుంద, ఆలూరు, హాలహర్వి మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బంది నియమించి ఎప్పటికప్పుడు పనులు చేపడుతున్నారు.

భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బంది రాకుండా ఉత్సవం ముగిసేంత వరకు నిత్యం తాగునీరు సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్యూఎస్‌ అధికారులు పేర్కొన్నారు.

చీకటిలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా కొండ చుట్టూ విద్యుత్తు సదుపాయం కల్పించారు. మధ్యలో ఇబ్బందులు రాకుండా ఆలూరు సబ్‌ డివిజన్‌లో సిబ్బంది అందుబాటులో ఉంటారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని