తోడికోడళ్ల మధ్య ఘర్షణ
eenadu telugu news
Published : 26/05/2021 05:51 IST

తోడికోడళ్ల మధ్య ఘర్షణ

ఒకరి తండ్రి మృతి


గోవింద్‌ అలియాస్‌ వెంకన్న మృతదేహం

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: చరవాణి విషయమై తోడికోడళ్ల మధ్య జరిగిన వివాదం ముదిరి ఒకరి తండ్రిని బలితీసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఆచార్లగూడెంలోని కొలికపొంగు శ్రీలత(భర్త రవితేజ), స్వర్ణకుమారి(భర్త రవికిరణ్‌) అనే ఇద్దరు తోడికోడళ్ల మధ్య చరవాణి దొంగిలించారనే విషయమై ఈ నెల 23న వివాదం జరిగింది. ఈ వివాదంలో వారిద్దరి తండ్రులు ఘర్షణపడ్డారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు పరిష్కరించేందుకు వచ్చిన వారిద్దరూ తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో శ్రీలత తండ్రి ఆచార్లగూడెం నివాసి అయిన జల్లేపల్లి గోవిందు(57) అలియాస్‌ వెంకన్నతో స్వర్ణకుమారి కుటుంబ సభ్యులైన రామచంద్రాపురం గ్రామం నడిగూడెం మండలం సూర్యాపేట జిల్లా నివాసులు పాలెపొంగు బాబు, జయమ్మ, నరేందర్‌, స్వర్ణకుమారి పెద్దమ్మ కుమారుడు రేపాల గ్రామవాసి నవీన్‌ ఘర్షణకు దిగారు. వీరిలో స్వర్ణకుమారి సోదరులు నరేందర్‌, నవీన్‌ శ్రీలత తండ్రి గోవిందును కాలితో బలంగా తన్నారు. దీంతో పక్కనే ఉన్న సీసీ రహదారిపై పడిన గోవిందు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గోవిందు కుటుంబసభ్యులు అతన్ని నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న నేలకొండపల్లి ఎస్సై అశోక్‌రెడ్డి, కూసుమంచి సీఐ సతీశ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

వివరాలు సేకరిస్తున్న సీఐ సతీశ్‌కుమార్‌, ఎస్సై అశోక్‌రెడ్డి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని