పట్టణాల్లో పచ్చదనం పెంపొందించాలి
logo
Published : 18/06/2021 02:58 IST

పట్టణాల్లో పచ్చదనం పెంపొందించాలి

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా పురపాలికల్లో ప్రధాన రహదారులకు రెండువైపులా మల్టీ లేవల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టి రెండు, మూడు వరుసల్లో పచ్చదనం పెంపొందించాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ సంచాలకులు సత్యనారాయణ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మతో కలిసి జిల్లాలోని అన్ని పురపాలిక కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పురపాలికల్లో హరితహారం, గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగం, జీతాల చెల్లింపు, సీసీ ఛార్జీలపై చర్చించారు. సీఎం కేసీఆర్‌ జిల్లాలలో పర్యటించి ఆకస్మిక తనీఖీలు చేయనున్నట్లు తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్‌, మొక్కల సంరక్షణ పరిశీలిస్తారని, గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగించుకొని రహదారుల వెంబడి మొక్కలు నాటాలని, మల్టీ లెవెల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌కు అనువైన చోట పూల మొక్కలు రెండు, మూడు వరుసల్లో నాటాలన్నారు.  పురపాలికల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని, నర్సరీకి బోర్డు, గేట్‌ ఏర్పాటు ఉండాలని రిజిష్టర్‌ నిర్వహించి సందర్శించిన అధికారుల సూచనలు నమోదు చేయాలన్నారు. మురుగు పారుదల వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ, వార్డు కమిటీల సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రజా మూత్రశాలల వినియోగంపై కమిషనర్లు తనీఖీలు చేపట్టాలన్నారు. లక్ష జనాభా మించిన పురపాలికల్లో నాలుగు వైకుంఠ ధామాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని