వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
eenadu telugu news
Updated : 22/09/2021 02:41 IST

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

మృతి చెందిన వర్రె సంధ్య

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: వరకట్న వేధింపులు తాళ లేక ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏనుబాములలో మంగళవారం చోటు చేసుకుంది. శిక్షణ ఎస్సై సురేష్‌రెడ్డి, బాధితుల వివరాల ప్రకారం... ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రానికి చెందిన చిత్తలూరి వెంకన్న, సోమమ్మ దంపతుల రెండో కూతురు చిత్తలూరి సంధ్య(26), ఇదే మండలం ఏనుబాములకు చెందిన వర్రె నరేష్‌ 2012లో పెద్దలకు సమ్మతం లేకున్నా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్ల వరకు వారి కాపురం సజావుగానే సాగింది. వారికి ఇద్దరు మగ పిల్లల సంతానం. మూడేళ్లుగా అత్తింటి వారు వరకట్నం తీసుకురావాలని సంధ్యను తీవ్రంగా వేధిస్తున్నారు. భర్త నరేష్‌తో పాటు అత్త మామ, బావ, ఆడపడుచు వరకట్నం కోసం వేధిస్తుండటంతో సంధ్య తన తల్లిదండ్రులకు గోడును వెల్లబోసుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో సంధ్యకు అరెకరం వ్యవసాయ భూమి ఇస్తామని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. తీరు మారని అత్తింటివారు సంధ్యను వేధించడం మానలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సంధ్య మంగళవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగు మందు తాగారు. విషయం తెలిసిన భర్త నరేష్‌ సంధ్యను సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి చూసేసరికి అప్పటికే సంధ్య మృతి చెందారు. సంధ్యను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి చిత్తలూరి వెంకన్న ఫిర్యాదు మేరకు భర్త నరేష్‌, అత్త ఐలమ్మ, మామ వీరయ్య, బావ వర్రె లింగయ్య, ఆడపడుచు స్వరూపలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు శిక్షణ ఎస్సై తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని