ప్రాణం తీసిన వేగం
eenadu telugu news
Published : 21/10/2021 06:16 IST

ప్రాణం తీసిన వేగం

ఆటో బోల్తాపడి ఇద్దరి దుర్మరణం

ప్రమాద స్థలిలో ధ్వంసమైన ఆటో : సువర్ణ(పాతచిత్రం)

నిజామాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కారు కంటే ముందు వెళ్లాలనే ఆత్రుత రెండు ప్రాణాలను బలి తీసుకుంది. నిజామాబాద్‌ మండలం మల్లారం సమీపంలో ఆటో బోల్తా పడి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ని నుంచి నిజామాబాద్‌ వైపు వస్తున్న ప్యాసింజర్‌ ఆటో గాంధీనగర్‌ సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బోల్తాకొట్టింది. ఘటన సమయంలో వేగం ఎక్కువగా ఉండడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. నిజామాబాద్‌ నగరం సంతోష్‌నగర్‌కు చెందిన ఉష(48), జక్రాన్‌పల్లి మండలం చాంద్‌మియాబాగ్‌తండాకు చెందిన సువర్ణ(30) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మరో ముగ్గురు ఆటోలో నుంచి బయటకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న గ్రామీణ ఠాణా ఎస్సై లింబాద్రి ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను తరలించారు. సువర్ణకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమె భర్త ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లారు.

కారు కంటే ముందు వెళ్లాలని..
ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వర్ని మండల కేంద్రంలో ప్రయాణికులతో బయలుదేరిన ఆటోలో మల్కాపూర్‌(టీ) వద్ద మరికొందరు ఎక్కారు.  గాంధీనగర్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా టిప్పర్‌ వచ్చింది. ఆటో వెనకాల వస్తున్న కారు ఎక్కడ తమను దాటుతుందోననే తొందరలో ఆటోడ్రైవర్‌ వేగం పెంచాడని ప్రయాణికులు చెప్పారు. వాహనంలో నుంచి ఎగిరి రోడ్డుపై బలంగా పడడంతో మహిళల తలలకు తీవ్రగాయాలై మృతి చెందినట్లు భావిస్తున్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని