బడి నిర్వహణ భారం
eenadu telugu news
Published : 24/10/2021 04:51 IST

బడి నిర్వహణ భారం

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామన్న ఆశలు గల్లంతవుతున్నాయి. ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుదామన్న హామీలు వట్టి మాటలవుతున్నాయి. బడుల నిర్వహణకే గ్రాంట్లు మంజూరు కాక ఆపసోపాలు తప్పడం లేదు. ఈ విద్యా సంవత్సరం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా నయాపైసా రాలేదు. చిన్నపాటి వసతుల కల్పనకు ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 2251 పాఠశాలల్లో దిక్కుతోచని స్థితి నెలకొంది.

ప్రత్యేక గ్రాంట్లు లేక ఇక్కట్లు

ప్రభుత్వ బడుల్లో విద్యుత్తు, తాగునీరు, చిన్నపాటి మరమ్మతులు, స్టేషనరీ, ప్రయోగ సామగ్రి, సుద్దముక్కలు, గ్రంథాలయాల నిర్వహణ కోసం ఏటా నిధులు విడుదలవుతాయి. ఈ గ్రాంట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివిధ పనులకు వినియోగించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. కొవిడ్‌ కారణంగా ఏడాదిన్నర పాటు బడులు మూతపడటంతో అనేక ఇబ్బందులు నెలకొన్నాయి. మూడు నెలలు ఆలస్యంగా తరగతులు ప్రారంభమైనా నిధుల మంజూరుపై సర్కారు దృష్టి పెట్టడం లేదు. విద్యార్థులు రావడానికి ముందే నిధులు విడుదలైతే ఆయా సమస్యలను త్వరగా పరిష్కరించే వీలుండేది. ప్రస్తుతం విరిగిపోయిన ఫ్యాన్లు, విద్యుత్తు పరికరాలు, తాగునీటి పైపులైన్లు తదితర సామగ్రి కొనుగోలు చేయాల్సి ఉంది. కొందరు ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది.

గతంలోనూ ఇలాగే

కొవిడ్‌కు ముందు కూడా పాఠశాలల నిర్వహణ గ్రాంట్లు సకాలంలో మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక సమస్యలపై పలుమార్లు విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదించినా.. విద్యా సంవత్సరం ముగిసే సమయానికి నిధులు వచ్చేవి. వాటిని సక్రమంగా వినియోగించకపోవడంతో సమస్యలు పునరావృతమయ్యేవి. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తిలక్‌రోడ్డు ప్రభుత్వ బడిలో ప్రత్యక్ష తరగతులు వింటున్న విద్యార్థులు

నిధుల కోసం నివేదించా

- రాజు, డీఈవో, కామారెడ్డి

ప్రభుత్వ బడులకు ప్రత్యేక నిధుల కోసం పాఠశాల విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో విడుదలవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆయా పాఠశాలల్లో ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. త్వరలో విద్యార్థుల సంఖ్య కొలిక్కిరానుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని