మీ త్యాగాలకు సమాజమే సలాం
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

మీ త్యాగాలకు సమాజమే సలాం

స్తూపం వద్ద పూలు చల్లి అంజలి ఘటిస్తున్న అమర వీరుల కుటుంబ సభ్యులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు చేస్తున్న త్యాగాలు అజరామరం.. వారికి సమాజమే సలాం చేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పెరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం స్మృతి పెరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం పోలీసులు ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడకుండా పనిచేస్తున్నారని అన్నారు. గతేడాది కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించారని చెప్పారు. పోలీసు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. తన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డిపై నక్సలైట్లు దాడి చేసిన సమయంలో ఆయన్ను కాపాడే క్రమంలో అంగరక్షకుడిగా ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ సి.వి.రత్నం ప్రాణత్యాగం చేసిన విషయాన్ని స్మరించుకున్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎస్పీ మలికా గార్గ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ సందర్భాల్లో ఆరుగురు పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని చెప్పారు. కొవిడ్‌ సమయంలో విధులు నిర్వర్తిస్తూ మరో పది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ సందర్భంగా సాయుధ పోలీసు బలగాలు స్మృతి కవాతు నిర్వహించాయి. అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, పోలీసు బ్యాండుకు అనుగుణంగా తుపాకులను అవనతం చేసి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట, కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌, ఒంగోలు మేయర్‌ సుజాత, అదనపు ఎస్పీ బి.రవిచంద్ర, ఓఎస్డీ కె..చౌడేశ్వరి, అదనపు ఎస్పీ(ఏఆర్‌) టి.శివారెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ బి.మరియదాసుతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు అమరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ క్రమంలో కొందరు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. స్మృతి పెరేడ్‌ అనంతరం పోలీసు కార్యాలయం నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించారు.

తుపాకులను అవనతం చేసిన పోలీసులు​​​​​​​


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని