ఎన్నాళ్లీ మూగ వేదన..!
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

ఎన్నాళ్లీ మూగ వేదన..!

న్యూస్‌టుడే, సరుబుజ్జిలి, పొందూరు: పాడి రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ఉచిత బీమా వారికి ధీమా ఇవ్వలేకపోతోంది. 2020 జులై లోపు మరణించిన మూగజీవుల బీమా మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత చనిపోయిన వాటి గురించి పట్టించుకోవడం మానేసింది. ఏడాది కాలంగా పరిహారం ఎప్పుడొస్తుందా అని బాధిత రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. పాడిపైనే ఆధారపడి జీవనం సాగించే రైతులు సాయం అందక మరొకటి కొనుగోలు చేయలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. బీమా సొమ్ము 48 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో వేయాల్సి ఉన్నా నెలల తరబడి కాలయాపనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా వందలాది పశువులు చనిపోతున్నాయి. స్థానిక పశువైద్య కేంద్రాల పరిధిలో మరణించిన పశువులకు సంబంధించి పశువైద్యాధికారులు శవపంచనామా నిర్వహించి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు నివేదికలు సమర్పిస్తున్నారు. జిల్లాలోని గతేడాది జులై నుంచి మరణించిన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు సంబంధించి ప్రభుత్వం నుంచి బీమా పరిహారం 13,86,73,000 అందాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. ఇప్పటివరకూ రూ.4 కోట్ల వరకు పరిహారం మాత్రమే బాధితులకు అందింది. ఇంకా 4,691 మందికి రూ.6 కోట్లకు పైగా పరిహారం చెల్లించాల్సి ఉన్నా అది జరగలేదు.
జాప్యానికి కారణం..
బాధిత రైతులు ఎన్నిసార్లు అధికారులను అడిగినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా జిల్లా స్థాయిలో సమస్య ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. కొవిడ్‌ కారణంగానే ఇవ్వలేకపోయామని అధికారులు పేర్కొంటున్నారు. మొదటి, రెండో విడత కొవిడ్‌ వ్యాప్తి తగ్గి పరిస్థితులు దాదాపు చక్కబడ్డాయి. అయినా ఇంతవరకు పరిహారం ఖాతాల్లో చేరకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.


పరిహారం ఇస్తే ఆవును కొనుక్కుంటా ...
- కె.సవరరాజు, షళంత్రి, సరుబుజ్జిలి మండలం

మా ఆవు జులై నెలలో మృతి చెందింది. ఇంతవరకు బీమా పరిహారం రాలేదు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది.  పరిహారం ఇస్తే కొత్త ఆవు కొనుక్కుంటాను. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.


త్వరలో బ్యాంకు ఖాతాల్లో జమ
- కిశోర్‌, పశుసంవర్థకశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు, శ్రీకాకుళం

అనారోగ్యంతో మృతి చెందిన పశువుల బీమా డబ్బులు త్వరలో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం రూ.10 కోట్లు వరకు డబ్బులు విడుదల చేసింది. కరోనా కారణంగా ఆలస్యమైంది. ఒకటి, రెండు నెలల్లో బాధితుల అందరికీ ఇస్తాం. అధైర్యపడాల్సిన పనిలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని