ఎప్పుడు కుళాయి తిప్పినా నీరే!
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

ఎప్పుడు కుళాయి తిప్పినా నీరే!

విశాఖలో 24 గంటలూ సరఫరా

ప్రయోగాత్మకంగా రెండు వేల ఇళ్లకు

1.11శాతానికి తగ్గిన నీటి నష్టాలు

‘స్కాడా’ అనుసంధానంతో చక్కటి ఫలితాలు

కంట్రోల్‌రూంకు వచ్చే సమాచారంపై సమీక్షిస్తున్న అధికారులు

నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేసే ప్రాజెక్టును త్వరగా పూర్తి స్థాయిలో పట్టాలెక్కించే క్రతువు విశాఖలో కొనసాగుతోంది. ఆ క్రమంలో నగరంలో పైపులైన్ల వ్యవస్థకు ప్రక్షాళన జరుగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్ని ప్రయోగాత్మకంగా ఎంపికచేసుకుని రోజంతా కుళాయిలకు నీటిని అందిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత జోడించి లోపాల్ని అధిగమిస్తూ నీటినష్టాల్ని భారీగా తగ్గించారు.

-ఈనాడు, విశాఖపట్నం

విశాఖ నగరం మధ్యలో 45చ.కి.మీ మేర రూ.400 కోట్ల ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో 247 తాగునీటి సరఫరా పనులు 2018లో ఆరంభించారు. ప్రస్తుతం 60శాతం పూర్తయ్యాయి. కుళాయి నీటికి విరామమనేదే లేకుండా ఇంటింటా శుద్ధినీటిని ఇవ్వాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఏడాదిగా దశల వారీగా దాదాపు రెండు వేల ఇళ్లకు పూర్తిస్థాయిలో కనెక్షన్‌లు ఇచ్ఛి. నీటి సరఫరా నాణ్యతను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించేలా సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డాటా అక్విజైషన్‌ (స్కాడా) సాంకేతికతను అనుసంధానించారు.

* పాత పైపులైన్ల వ్యవస్థలో 40శాతం నీరు వృథా అయ్యేది. ఇప్పుడక్కడ కొత్తపైపులైను వ్యవస్థ రావడంతో పాటు స్కాడా ద్వారా సరఫరా నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు.●

* ప్రస్తుతం సగటున 1.11శాతం మాత్రమే నీటినష్టం కనిపిస్తోంది. ప్రతిపాదిత ప్రాంతాల్లో గతంలో రోజుకు గంట, గంటన్నర మాత్రమే తాగునీరొచ్చేది. ఇప్పుడు సరఫరా నాణ్యతను పెంచి 24 గంటలూ ఇస్తున్నారు. పైపులైను వ్యవస్థ ఉన్నచోటల్లా అడ్వాన్స్డ్‌ మీటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఏఎంఐ) వ్యవస్థను తెచ్చారు. దీంతో నీటిసరఫరా ఎలా ఉంది, ఎక్కడ లోపాలున్నాయనేది ప్రతి గంటకీ స్కాడా కంట్రోల్‌రూంకి సంకేతాలు అందేలా సాంకేతికత ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవస్థను మాధవధార వుడా కాలనీ ఫేజ్‌-1, మర్రిపాలెం వుడాకాలనీ, కరాస, శివానగర్‌, ఎఫ్‌సీఐకాలనీ, రాణాప్రతాప్‌నగర్‌ ప్రాంతాలకు అనుసంధానించి పరిశీలన చేస్తున్నారు.

మరో నెలరోజుల్లో ఇంకో 2వేల ఇళ్లకు ఈ వ్యవస్థను అనుసంధానించనున్నారు. దీంతో నగరంలోని కళింగ నగర్‌, రాజీవ్‌నగర్‌, మురళీనగర్‌, మాధవధార వుడాలేఅవుట్‌ ఫేజ్‌-2, 3కి 24గంటల తాగునీటి సౌకర్యం రానుంది.

ట్యాంకు నుంచి కుళాయి వరకు: స్కాడా వ్యవస్థ పర్యవేక్షణతో మంచి ఫలితాలొస్తున్నాయని జీవీఎంసీ అధికారులు వెల్లడిస్తున్నారు. పైపులైన్ల వెంబడి అక్కడక్కడ సెన్సార్లను అమర్చడంతో పాటు నీటి ట్యాంకునుంచి.. ఇంటి మీటరు వరకు.. నీటి సరఫరా నాణ్యతను గుర్తించే మీటర్లనూ అమర్చారు. నీటిశుద్ధి నాణ్యతనూ పరీక్షించే వ్యవస్థనూ జోడించారు.●

* ట్యాంకు నుంచి కాలనీల పైపులైన్లకు నీరు ముందే సరఫరా నాణ్యతను పసిగట్టేలా డిస్ట్రిక్ట్‌ మీటర్‌ ఏరియా (డీఎంఏ) యంత్రాల్ని అమర్చారు. ఇక్కడినుంచి ఎంతనీరు వెళ్తోంది, దాని నాణ్యత, ఎంత ఒత్తిడితో వెళ్తోంది లాంటి గణాంకాల్ని సెన్సార్ల ద్వారా గుర్తించేలా పరికరాలు అమర్చారు. ఇది సౌరవిద్యుత్తుతో పనిచేసి స్కాడాకు వివరాలు పంపుతుంది.

* ఇళ్లలో ఎంతనీరు వాడుతోందీ తెలుసుకునేందుకు ప్రత్యేక డిజిటల్‌ మీటర్లు పెట్టారు. ట్యాంకునుంచి ఎంతనీరు వెళ్తోంది, అంతేనీరు ఇళ్లదాకా చేరుతోందా లేదా అనే గణాంకాలు కంట్రోల్‌రూమ్‌కు చేరతాయి.

* పైపులైన్లలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా, లీకేజీలున్నా.. సమాచారం అందగానే రెండు సెకన్లలో సరఫరాను ఆపేలా ఆన్‌లైన్‌ రిమోటింగ్‌ వ్యవస్థను కంట్రోల్‌రూమ్‌లో ఏర్పాటుచేశారు. ప్రజాసమస్యల్ని వెంటనే పర్యవేక్షించేలా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కూడా పెట్టారు.●


డిజిటల్‌ ‘నాణ్యతా’ సంకేతం..: శుద్ధి నీటిని పంపింగ్‌స్టేషన్‌ నుంచి కాలనీల్లోని ఓవర్‌హెడ్‌ ట్యాంకుకు తరలిస్తున్నారు. ఇక్కడే పీహెచ్‌, క్లోరిన్‌ నాణ్యతను మరోసారి పరీక్షించేలా ఆటోమేటిక్‌ యంత్రాల్ని పెట్టారు. చిత్రంలో పసుపురంగు వృత్తంలోని డబ్బాలో ఇవి ఉంటాయి. కొన్నిసెకన్లలోనే చిత్రంలో ముందున్న పెద్దడబ్బాలో డిజిటల్‌తెరపై ఫలితం కనిపిస్తుంది. నీటి శుద్ధిలో లోపముంటే ఈ యంత్రం వెంటనే కంట్రోల్‌రూమ్‌ను అప్రమత్తం చేస్తుంది, అంతా సవ్యంగా ఉంటే బాగుందని సంకేతమిస్తుందని ప్రాజెక్టు నిర్వాహణ సంస్థ ఎన్‌సీసీ సీనియర్‌ ఇంజినీర్‌ జానకీరామ్‌ తెలిపారు.


చక్కటి ప్రయత్నం..

నేను నాల్కో ఇంజినీరుగా రిటైరయ్యాను. 20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మా ప్రాంతంలో బోర్లు కూడా సరిగా పడటంలేదు. తాగునీటికొరత తీవ్రంగానే ఉండేది. కొంతకాలంగా నిరంతరాయంగా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నీటి ప్రవాహ వేగమూ బాగుంది. ఈ పథకాన్ని ఇలాగే కొనసాగిస్తే నీటి కష్టాలు తప్పినట్లే.

-కె.అప్పారావు, మర్రిపాలెం వుడాకాలనీTags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని