ఫార్మా బస్సు ఢీకొని బాలుడి మృతి
eenadu telugu news
Updated : 31/07/2021 03:48 IST

ఫార్మా బస్సు ఢీకొని బాలుడి మృతి

ప్రసాద్‌కుమార్‌ (దాచినచిత్రం)

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: సరదాగా ఆటలాడుకుంటున్న బాలుడిని బస్సు మృత్యువు రూపంలో కబళించింది. ఈ సంఘటన జీవీఎంసీ 79వ వార్డు పరిధి లంకెలపాలెం రహదారి పైవంతెన కింద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పరవాడ ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఆగిరిపల్లికి చెందిన గంగరాజు, చందమ్మ దంపతులు గ్రామాల్లోని ప్లాస్టిక్‌ బొమ్మలు, ఎలక్ట్రికల్‌ సామాన్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 5 గురు మగపిల్లలు, ఒక పాప సంతానం. ఈ దంపతులు వారి పిల్లలను తీసుకుని 3 నెలల క్రితం లంకెలపాలెం వచ్చి రహదారి పైవంతెన కింద నివాసముంటున్నారు. వీరి నాలుగో కుమారుడు ప్రసాద్‌కుమార్‌(12) మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా సిలికాన్‌ ఫార్మా సంస్థకు చెందిన బస్‌ పైవంతెన కింద యూటర్న్‌ తీసుకునే క్రమంలో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం గాజువాకలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని