తండ్రీకొడుకులే కీచకులై..
eenadu telugu news
Published : 15/09/2021 02:49 IST

తండ్రీకొడుకులే కీచకులై..

తాయిలాలు చూపి ఇద్దరు బాలికలపై అత్యాచారం

పూడిమడకలో విచారణ చేస్తున్న డీఎస్పీ మహేశ్వరరావు, పోలీసు అధికారులు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఇద్దరు బాలికలపై కామాంధులైన తండ్రీకొడుకుల కన్ను పడింది. తప్పుదారిలో వెళ్తున్న కుమారుడిని మందలించాల్సిన తండ్రి కూడా దారి తప్పాడు. ఐదు పదుల వయస్సులోనూ మనవరాలి వయసుండే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటలు నేర్పిస్తానని చెప్పి కుమారుడు... తినుబండారాలు, డబ్బులు ఎరచూపి తండ్రి ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు. కుమారుడైతే ఈ వికృత క్రీడను మళ్లీ చూసుకోవడానికి తన సెల్‌ఫోన్లో సైతం చిత్రీకరించుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వివరించారు.

అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు కడపాలెంకు చెందిన కొంతమంది బాలికలకు ఇదే గ్రామానికి చెందిన నూకరాజు (27) కబడ్డీ నేర్పిస్తానని, తినుబండారాలు, డబ్బులు ఇస్తానని చెప్పి దగ్గరయ్యాడు. కుమారుడు నూకరాజు వద్దకు బాలికలు వస్తున్నారనే విషయాన్ని తండ్రి బాపయ్య (50) గమనించాడు. ఈనెల 12న ఆటలాడడానికి వచ్చిన బాలికల్లో ఒకరిని నూకరాజు సమీపంలో ఉండే జీడిమామిడి తోటల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో తండ్రి బాపయ్య కూడా తినుబండారాల ఆశచూపి మరో బాలికను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సహ బాలికలు గ్రామంలోని కొందరికి దీనిపై సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి చూసేసరికి విషయం బయటపడింది.

చివరివరకు రాజీ యత్నం?

తండ్రీకొడుకులిద్దరూ చాలాకాలంగా బాలికలకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలనే చివరివరకు ప్రయత్నం చేసినా పోలీసుల దృష్టికి వెళ్లింది. ఎస్సై ఉపేంద్ర కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందివ్వడంతో అనకాపల్లి దిశా పోలీసు స్టేషన్‌ డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు రంగంలోకి దిగారు. నిందితులిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

* బాధిత బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. నిందితులు, బాధితుల ఇళ్ల వద్ద విచారణ చేపట్టారు. ఎలమంచిలి సీఐ వెంకటరమణ, ఎస్సై ఉపేంద్ర విచారణలో పాల్గొన్నారు.

తెదేపా, జనసేన నేతల నిరసన

బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను శిక్షించాలంటూ మంగళవారం పూడిమడకలో నిరసన చేపట్టారు. ఏపీలో మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని జనసేన ఉత్తరాంధ్ర జిల్లా సమన్వయకర్త సుందరపు విజయ్‌కుమార్‌ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైనా ముఖ్యమంత్రికి ఏమీ పట్టడంలేదని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ప్రగడ నాగేశ్వరరావు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డ్రీమ్స్‌ నాయుడు ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని