వచ్చిందే అరకొర... కొత్తవారికెలా!
eenadu telugu news
Published : 19/10/2021 03:39 IST

వచ్చిందే అరకొర... కొత్తవారికెలా!

విద్యా కానుక కోసం 48 వేల మంది ఎదురుచూపులు

- ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, దేవరాపల్లి, న్యూస్‌టుడే

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పేరిట ఏడు రకాల వస్తువులను కిట్లుగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఛైల్డ్‌ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాల ప్రకారం వీటిని అందిస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఇలా కొత్తగా చేరిన పిల్లలకు మాత్రం విద్యాకానుక అందజేయలేకపోతున్నారు. గతేడాది సుమారు 40 వేల మందికి జేవీకే కిట్లు అందలేదు. తాజాగా ఈ ఏడాది కూడా సుమారు 48 వేల మంది కొత్త విద్యార్థులు వీటి కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు కానుక అందుకున్న వారిలో కూడా కొంతమందికి బ్యాగులు అందితే పుస్తకాలందలేదు.. బెల్ట్‌లు ఇస్తే బూట్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది.

జిల్లాలో 3,63,114 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక ఇచ్చారు. స్కూల్‌ బ్యాగ్‌, మూడు జతల ఏకరూప దుస్తులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, బెల్ట్‌, నోట్‌ పుస్తకాలు, డిక్షనరీ ఒక్కో కిట్‌గా అందజేశారు. వీటిలో బూట్లు, బ్యాగ్‌లు వంటి కొన్నిరకాల వస్తువులు తక్కువగా వచ్చినా ఉన్నవాటితో సరిపెట్టేశారు. ఈ ఏడాది మరో 48,132 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వీరికి కానుక ఇవ్వడానికి కిట్లు సరఫరా కాలేదు. దీంతో కొత్త విద్యార్థులంతా బ్యాగులు లేకుండా, బూట్లు ధరించకుండానే పాఠశాలలకు హాజరవుతున్నారు. గతేడాదిలాగే కొత్తవారికి మొండిచేయి చూపిస్తారా.. కానుక ఇచ్చి మురిపిస్తారా చూడాలని సంబంధిత అధికారులే చర్చించుకుంటున్నారు.


బూట్లు ఇవ్వలేదని చూపుతున్న రైవాడ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు


నాసిరకంగా బ్యాగులు..

స్కూల్‌ బ్యాగుల పరిస్థితి ఇదీ..

ఈ ఏడాది పాత విద్యార్థుల్లోనే సుమారు 10 వేల మందికి బ్యాగులు అందలేదు. ఇప్పటికే విద్యార్థులకు ఇచ్చిన స్కూల్‌ బ్యాగులు నాసిరకంగా ఉంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. బ్యాగు ఇచ్చిన రెండు రోజులకే తాళ్లు తెగిపోతుండగా.. జిప్పులు ఊడిపోతున్నాయి. కొందరు తల్లిదండ్రులు బ్యాగులకు మరలా కుట్లు వేయించుకుంటున్నారు. మరికొందరు తెగిపోయిన వాటికి పిన్నులు, చిన్నపాటి తాళ్లు కట్టి పాఠశాలలకు పంపిస్తున్నారు. బ్యాగు పరిమాణం కంటే ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు, టిఫిన్‌ బాక్స్‌లు పెట్టడం వల్లే త్వరగా పాడైపోతున్నాయని ఉపాధ్యాయులు సర్దిచెబుతున్నారు. కొందరు విద్యార్థులకు ఇచ్చిన బూట్లు సైజులు మారడంతో వాటిని మరలా వెనక్కి తీసుకుని వాటి స్థానంలో కొత్త బూట్లు ఇవ్వకుండా వదిలేశారు.


ఈనెలలోనే అందిస్తాం..

కొత్తగా చేరిన విద్యార్థులకు కిట్లు అందించాలని ప్రతిపాదనలు పంపించాం. ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. అందరికీ విద్యాకానుక అందుతుంది. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. ఇచ్చిన అన్నింటి నాణ్యతా బాగానే ఉంది. అన్ని రకాల వస్తువులను మరలా నాణ్యత తనిఖీల కోసం ఉన్నతాధికారులకు పంపించాం. కొన్ని రకాలు చాలకపోయినా మిగులు నిల్వల నుంచి సేకరించి అందజేస్తున్నారు.

- ఎల్‌.చంద్రకళ, ఇన్‌ఛార్జి ఏపీసీ, సమగ్రశిక్షా


ఇంకా ఇస్తామంటున్నారు..

నాకు ముగ్గురు ఆడపిల్లలు. వీరంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. నాలుగు, ఆరు తరగతులు చదువుతున్న పిల్లలకు జగనన్న విద్యాకానుక పూర్తిగా ఇచ్చారు. ఒకటో తరగతి చదువుతున్న పాపకు బ్యాగు, బూట్లు ఇవ్వాల్సి ఉంది. అడిగితే పై అధికారులు పంపాల్సి ఉంది, త్వరలోనే వచ్చేస్తాయి అన్నారు. ఇవి ఎప్పుడొస్తాయో తెలియడం లేదు.

- ఎం.దేవి, బుచ్చిరాజుపేట


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని