భళా.. బాల మేధావి
eenadu telugu news
Published : 27/10/2021 02:17 IST

భళా.. బాల మేధావి

ఇన్‌స్పైర్‌ మనక్‌కు 2131 నామినేషన్లు
నర్సీపట్నం పట్టణం, న్యూస్‌టుడే

విద్యార్థులు తయారు చేసిన నమూనాలు (పాత చిత్రాలు)

మనసు పొరల్లో ఒదిగిన ఆలోచనలకు ఆ చిన్నారులు అక్షరరూపం ఇచ్చారు. ఇన్‌స్పైర్‌ - మనక్‌ ప్రదర్శనలకు ప్రాజెక్టులు సిద్ధం చేయడానికి బాల మేధావులంతా సంసిద్ధులయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 2131 నమూనాలు సిద్ధం చేసేందుకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేశారు. ఆదివారం అర్ధరాత్రిలో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో విశాఖ జిల్లా ఐదో స్థానంలో నిలిచింది.
పది శాతం నమూనాలను ప్రదర్శనకు సిద్ధం చేయడానికి కేంద్ర విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక శాఖ నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అనుమతించిన ప్రాజెక్టుల తయారీ, ఇతర ఖర్చుల కోసం ఒక్కో నమూనాకు రూ. 10 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. వీటన్నింటినీ జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో ఉంచుతారు. ఉత్తమంగా ఎంపికైన వాటిని రాష్ట్రస్థాయి ప్రదర్శనకు పంపుతారు.

ప్రతిభావంతులైన విద్యార్థులను శాస్త్రీయ అధ్యయనం వైపు ఆకర్షించేలా కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్‌ - మనక్‌ (మిలియన్‌ మైండ్స్‌ అగ్‌మెంటెంగ్‌ నేషనల్‌ ఆస్పిరేషన్‌ అండ్‌ నాలెడ్జ్‌) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. స్థానిక సమస్యలను ప్రతిబింబిస్తూ వాటికి పరిష్కార మార్గాలను చూపేవిగా ప్రాజెక్టులు ఉండాలన్నది నిబంధన. పాత ప్రాజెక్టే అయినా తాజా పరిస్థితులకు అన్వయించి పరిష్కారం చూపాల్సి ఉంటుంది. 2019-20 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి ఆరు నమూనాలను జాతీయ స్థాయిలో ప్రదర్శించారు. కరోనా నేపథ్యంలో గతేడాది ప్రత్యక్షంగా ప్రదర్శనలు జరగలేదు. కరోనా తగ్గుముఖం పట్టడంతో కొద్దిరోజుల క్రితం దరఖాస్తులు ఆహ్వానించగా విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ఎన్నెన్ని ఆలోచనలో..
* సైకిల్‌ తొక్కుతుంటే సెల్‌ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అయ్యేలా ప్రాజెక్టు తయారీకి నర్సీపట్నంలో ఓ బాలిక సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రమాద పరిస్థితులపై అప్రమత్తం చేసేలా    శిరస్త్రాణం రూపొందిస్తామని మరో బాలుడు ముందుకొచ్చాడు. గతంలో అనేకమంది కొత్త  ఆవిష్కరణలను తెరపైకి తీసుకువచ్చారు.
* బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆసుపత్రుల్లో ఎవరూ లేకున్నా.. ఫ్యాన్లు తిరుతుంటాయి. దీనివల్ల విద్యుత్తు వృథా అవుతుంటుంది. కుర్చీలో నుంచి లేవగానే ఫ్యాను దానికదే ఆగిపోయేలా ఒకరు ప్రాజెక్టు తయారు చేశారు.
* స్మార్ట్‌ గ్యాస్‌ పేరిట మరొకరు రూపొందించిన పరికరం అబ్బురపరిచింది. కూల్‌డ్రింక్‌ సీసా మూత ఎలా తీస్తామో వంటగ్యాస్‌ సిలెండర్‌ కప్పు అలాగే తీసేలా తయారు చేసిన పరికరం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రదర్శనలో ఉంచారు.
* దివ్యాంగుల చేతికర్ర సెన్సర్లలో పనిచేస్తూ అడ్డంకులను గుర్తు చేసేలా ఒకరు, కొబ్బరికాయలు ఒలిచే యంత్రాన్ని మరొకరు, డ్రైనేజీల్లో చెత్తను సులువుగా బయటకు తీసేలా ఇంకొకరు నమూనా ప్రాజెక్టులు రూపొందించారు.
సైకిల్‌ జనరేటర్‌ తయారు చేస్తా..: తక్కువ ఖర్చుతో సైకిల్‌ జనరేటర్‌ తయారు చేయడం కోసం దరఖాస్తు ఇచ్చా. స్కూల్లోని సైన్సు ఉపాధ్యాయుడు సహకారంతో ఇప్పటికే ఇందుకోసం ప్రయత్నం చేశా. సైకిల్‌ పెడల్‌కు పరికరం అమర్చడం ద్వారా సెల్‌ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అయ్యేలా, ఎల్‌ఈడీ దీపం వెలిగేలా ప్రాజెక్టు ఉంటుంది.

- సయ్యద్‌ మెహబున్నిసా, పదోతరగతి, నర్సీపట్నం

ఇంటెలిజెంట్‌ హెల్మెట్‌: ఇంటెలిజెంట్‌ హెల్మెట్‌ తయారు చేయడానికి సంసిద్ధత తెలియజేస్తూ యాప్‌లో నమోదు చేశా. వాహన చోదకుడు కదలికలు అనుసరించి సెన్సర్లు, హెచ్చరికలు చేసేలా శిరస్త్రాణం రూపకల్పన చేయాలన్నది ఆలోచన. తద్వారా వాహనం నడిపే వారిలో ఏకాగ్రత ఉండేలా చూడాలన్నది ఆలోచన. సైన్స్‌ ఉపాధ్యాయుడుతో చర్చిస్తే కొన్ని సూచనలు ఇచ్చారు. అధునాతన ట్రాఫిక్‌ సిస్టమ్‌పై ఇప్పటికే ఎన్నో నమూనాలు వచ్చాయి. వినూత్నంగా ఏదైనా ప్రయత్నించాలని ఆలోచించా. ప్రమాదాల నివారణకు ఏదైనా ప్రాజెక్టు రూపకల్పన చేయాలని ఈ దిశగా ఆలోచన చేశా.

- వేములపూడి సురేష్‌, నర్సీపట్నం

ఆలోచనలన్నీ ఉన్నతమైనవే..
చిన్నారులే అయినా వారి ఆలోచనలన్నీ ఉన్నతంగా ఉంటున్నాయి. ఉపాధ్యాయుల ద్వారా అందిన సమాచారం ప్రకారం వ్యవసాయ రంగం నుంచి సాంకేతిక రంగం వరకు కొత్త ఆవిష్కరణల దిశగా బాల మేధావుల దృష్టి ఉంది. నమోదు చేసిన ప్రాజెక్టు ఎంపికైతే నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకు రూ.10 వేలు జమ అవుతాయి. నమూనా తయారీకి అవసరమైన సామగ్రి కొనుగోలుకు, రవాణా ఖర్చులకు వీటిని ఉపయోగించుకోవచ్చు. విద్యార్థుల శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వెలుగులోకి తేవడం నిరంతర పక్రియగా ఉండాలి. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఆలోచనల పెట్టె (ఐడియా బాక్స్‌) పెట్టాలి. విద్యార్థుల నుంచి కొత్త ఆలోచనలు ఆహ్వానించాలి.

- కె.ప్రసాద్‌, జిల్లా సైన్స్‌ అధికారి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని