ఇవి.. కాలుష్యాన్ని మింగేస్తాయ్‌!
eenadu telugu news
Published : 27/10/2021 05:32 IST

ఇవి.. కాలుష్యాన్ని మింగేస్తాయ్‌!

ఈనాడు, విశాఖపట్నం

చెట్లు కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నది తరచూ వింటున్నమాటే. ఎలాంటి వృక్షాలు తీవ్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడతాయనే అంశంపై చాలా మందికి అవగాహన తక్కువ. ఈ నేపథ్యంలో గీతం ఇనిస్టిట్యూట్‌
ఆఫ్‌ సైన్స్‌లోని ఎన్విరాన్‌మెంట్‌ విభాగం జీవీఎంసీ పరిధిలో వృక్ష జాతులపై మూడేళ్లపాటు పరిశోధించి.. కాలుష్యాన్ని అత్యంత ప్రభావమంతంగా అడ్డుకొనే చెట్లను గుర్తించింది.

పురప్రాంతాల్లో కొన్ని కాలుష్య కారకాలు బాగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఏం చేయాలనే కోణంలో అక్కడి యంత్రాంగాలు తలలు పట్టుకుంటున్నాయి. చాలామంది పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నా అందులో ఏవి కాలుష్యాన్ని తగ్గిస్తున్నాయో తెలియడం లేదు. గీతం ఇనిస్టిట్యూట్‌లోని పర్యావరణ శాస్త్ర సహాయ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.గోపమ్మ దీనికో పరిష్కారం చూపుతున్నారు. ఏ చెట్లు బాగా కాలుష్యాన్ని తగ్గిస్తాయనే కోణంలో మూడేళ్లపాటు వేసవి, చలి, వర్షాకాలాల్లో పరిశోధన చేయగా అది తాజాగా ఓ అంతర్జాతీయ జర్నల్‌లోనూ ప్రచురితమైంది.
* విశాఖలో రవాణా, పరిశ్రమలపరంగా కీలకమైన గాజువాక, జ్ఞానాపురం, బీహెచ్‌పీవీ, పరవాడతో పాటు విభిన్న వాతావరణం ఉండే రుషికొండలోనూ పరిశోధించారు. ఇక్కడ 450 రకాల వృక్షజాతులు కనిపించాయి.  అన్నింటికన్నా 17 రకాలు ఎక్కువున్నాయి. ఇందులో దేశీయ, విదేశీయ జాతులూ ఉన్నాయి. వీటి ఆకుల్ని సేకరించి కాలుష్యానికి తట్టుకుని కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గించేందుకు ఎలా దోహదపడుతున్నాయనే కోణంలో చూశారు. వాటి పచ్చదనంలో వచ్చే మార్పులు, వాటి వేర్లు నీరు అందుకునే విధానం, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే ఆస్కార్బిక్‌ యాసిడ్‌ను ఎంతమేర నిల్వ ఉంచుకుంటున్నాయి తదితర కోణాల్లో పరీక్షించి ‘ఎయిర్‌ పొల్యూషన్‌ టోలరెన్స్‌ ఇండెక్స్‌ (వాయు కాలుష్య సహన సూచీ - ఏపీటీఐ)’ స్థాయిల్ని చూశారు. మరోవైపు ఆయా వృక్షాలు భౌతికంగా కాలుష్య ప్రభావాన్ని గుర్తించారు.ఎదుగుదలలో మార్పులు, రంగులు మారడం, దుమ్ముధూళితో వాటిలో వచ్చే ప్రభావాలు అంచనావేసే ‘యాంటిసిపేటెడ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇండెక్స్‌ (ఏపీఐ)’ గణాంకాల్నీ తీశారు. ఏపీటీఐ, ఏపీఐ ద్వారా తేలిందేంటంటే.. కాలుష్యాన్ని తగ్గించడంలో అత్యంత ప్రభావమంతంగా దేశీయ మొక్కలే పనిచేస్తున్నాయని.
ఇలా మేలు..
రసాయన, భౌతిక పరీక్షలు నిర్వహించిన తర్వాత.. కాలుష్యకారక ప్రాంతాల్లో ఏ వృక్షాలు ఎంతశాతం ప్రభావమంతంగా పనిచేస్తాయో వివరించారు. వీటి ప్రయోజనాల మేరకు స్కోరింగ్‌ ఇంచి మన ప్రాంతానికి ఉత్తమమైనవని  పేర్కొన్నారు...
వృక్షాలు వాటికి వచ్చిన స్కోరింగ్‌ (శాతాల్లో)
* మర్రి:  93.75 * పనస: 81.25 *
వేప:   81.25  * నీలగిరి:  81.25  * మామిడి:  81.25  * కానుగ 81.25: * నేరేడు: 81.25  * చింత: 75 * తురాయి: 68.75 * అశోక: 68.75 * బాదం: 68.75 * దిరిసన:  62.5
త్వరగా ఎదగాలి, పచ్చగా ఉండాలి, పండ్లు పువ్వులు వేగంగా రావాలి.... మొక్కను ఎంపిక చేసుకునేముందు చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు. వాటికి ఆకర్షితులవుతున్నారు. ఇలా ఎంపికచేసుకునే వాటిలో చాలావరకు విదేశీ వృక్షజాతులే ఉంటున్నాయి. ఇలాంటివి ఇక్కడి కాలుష్యానికి, స్థానిక వాతావరణానికి ఎక్కువగా సరిపడవని పరిశోధనలో తేలింది. నిదానంగా పెరిగినా దేశీయ వృక్ష జాతులు మాత్రం అద్భుతంగా కర్బన ఉద్ఘారాల్ని తగ్గిస్తున్నాయి...
అని డాక్టర్‌ గోపమ్మ పేర్కొన్నారు.

అవి భళా...
పరిశోధనలో తీసుకున్న వృక్షజాతుల్ని బట్టి కాలుష్యాన్ని అత్యంత ప్రభావమంతంగా తగ్గించేపనిలో మర్రివృక్షం మొదటిస్థానంలో ఉందని తేల్చారు. అయితే ఇది పెరిగేందుకు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడంతో అన్నిచోట్లా అనువుగా ఉండదని చెబుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పనస, వేప, నీలగిరి, మామిడి, కానుగ, నేరేడు చెట్లున్నాయి. వీటికన్నా కాస్త తక్కువ ప్రభావం చూపినా.. చింత, అశోక, బాదం వృక్షాలూ మంచి ఫలితాల్నే ఇస్తున్నాయని వెల్లడైంది. విశాఖతో పాటు నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దేశీయ వృక్షజాతుల్ని పెంచితే  చాలా మేలు జరుగుతుందంటున్నారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని