Road Accident: రోడ్డు ప్రమాదంలో విశాఖ మూడో పట్టణ సీఐ దుర్మరణం
eenadu telugu news
Updated : 25/11/2021 08:57 IST

Road Accident: రోడ్డు ప్రమాదంలో విశాఖ మూడో పట్టణ సీఐ దుర్మరణం

విశాఖ: విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న విశాఖ నగర మూడో పట్టణ సీఐ ఈశ్వరరావు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం, పోలీస్ జీపు ఢీకొని ప్రమాదం జరిగింది. నగరంలోని ఎండాడ మీదుగా సీఐ మధురవాడలోని తన నివాసానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఆయన పోలీస్‌ జీపు ముందు భాగంలో కూర్చొని ఉండటంతో ఘటన జరిగిన వెంటనే అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ సంతోష్‌కి కూడా తీవ్ర గాయాలు కాగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సహా పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీస్‌ వాహనం ఏ వాహనాన్ని ఢీకొట్టింది.. అది ఎటు వెళ్లిందనే అంశాలన్నింటినీ సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని మనీష్‌ కుమార్ సిన్హా అన్నారు. గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి నిలకడగానే ఉందని కమిషనర్ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని