‘పోరాడితేనే సమస్యలకు పరిష్కారం’
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

‘పోరాడితేనే సమస్యలకు పరిష్కారం’

మాసపత్రిక ఆవిష్కరిస్తున్న జ్యోతి, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, తదితరులు

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: పోరాటాల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి అన్నారు. మెదక్‌ పట్టణంలోని బాలాజీ గార్డెన్స్‌లో జాతీయ వికలాంగుల హక్కుల వేదిక (ఎన్పీఆర్డీ) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో భాగంగా తొలిరోజు జరిగిన సమావేశానికి హాజరైన జ్యోతి మాట్లాడుతూ.. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళలు, దివ్యాంగులపై దాడులు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాటిని అరికట్టాలని, దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు, పింఛన్లు అందడం లేదని వాపోయారు. నిరుద్యోగ దివ్యాంగులకు బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. అంతకుముందు శిక్షణ తరగతులను ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. వికలాంగుల వాయిస్‌ అక్టోబరు మాసపత్రికను ద్వారకా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బాలకృష్ణ, తదితరులు ఆవిష్కరించారు. పీఏసీఎస్‌ ఉద్యోగుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్‌, ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి వరప్రసాద్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, నర్సమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని