close

మంగళవారం, జులై 16, 2019

ప్రధానాంశాలు

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

తాండూరులో అర్జీలు స్వీకరించిన పాలనాధికారిణి
తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే:

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకు వచ్చి వాటిని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి పరిష్కార వేదికగా నిలుస్తోంది. గతేడాది నుంచి ఎన్నికల నిబంధనలతో నిలిచిపోయిన ఈ కార్యక్రమం గత వారం నుంచి మళ్లీ ప్రారంభమైంది. తాండూరులోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారిణి అయేషా పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను విన్నారు. వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు సిఫారసు చేశారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆమె వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం మొత్తం 50 అర్జీలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రైతు బంధు పథకం రాయితీ రాలేదని, యాలాల మండలం శివసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పెంచి వెంటనే ఇవ్వాలని, పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల నమోదు ప్రక్రియ సక్రమంగా జరగటం లేదని, ఆదర్శనగర్‌లో నెలకొన్న సమస్యలను ఆయా ప్రాంతాల ప్రజలు పాలనాధికారిణి దృష్టికి తీసుకు వచ్చారు. వీటితో పాటు పింఛన్లు, భూ వివాదాల వంటి సమస్యలు పాలనాధికారిణికి విన్నవించారు. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌, తాండూరు మండలాలతో పాటు కొడంగల్‌ నియోజక వర్గంలోని బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌, కొడంగల్‌ మండలాలకు చెందిన ప్రజలు సమస్యలపై ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్నారు. అనంతరం పాలనాధికారిణి వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. అపరిష్కృతంగా ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీడీఓ జాన్సన్‌, ఆర్డీఓ వేణుమాధవరావు, ఇతర శాఖల జిల్లా అధికారులు రెవెన్యూతో పాటు నీటి పారుదల, పురపాలక సంఘం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మినీ ట్యాంక్‌ బండ్‌ పనులు వేగవంతం చేయాలి
ఆక్రమణలకు గురవుతున్న గొల్ల చెరువు, చిలుక వాగు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని పాలనాధికారిణి అయేషా నీటి పారుదల శాఖ, పురపాలక అధికారులను ఆదేశించారు. గొల్ల చెరువు, చిలుక వాగును సోమవారం ఆమె పరిశీలించారు. గొల్ల చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. పట్టణంలోని మురుగు నీరంతా గొల్ల చెరువులోకి వస్తుండడంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు ఆమె దృష్టికి తెచ్చారు. పట్టణం నుంచి మురుగు నీరు చెరువులోకి రాకుండా ప్రణాళిక సిద్ధం  చేయాలని అధికారులకు ఆమె సూచించారు. చెరువుకు ఆనుకుని ఉన్న ఇళ్ల పక్క నుంచి కాలువ తవ్వి మురుగు నీరు చెరువులోకి రాకుండా సిమెంటు కాల్వ నిర్మిస్తే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని తెలిపారు. ఇందుకు అవసరమయ్యే నిధులను సమకూర్చాలని పురపాలక అధికారులను పాలనాధికారిణి ఆదేశించారు. చెరువు నిండిన తర్వాత మిగులు నీరు బయటకు వెళ్లటానికి ఉన్న అలుగును పరిశీలించారు. అలుగు కింద నీళ్లు పారకుండా ప్రయివేటు వ్యక్తులు వేసిన కంచెను చూసిన, అధికారులపై పాలనాధికారిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులకు వెంటనే తాఖీదులు జారీ చేసి కంచెను తొలగించాలని ఆదేశించారు. అనంతరం చిలుక వాగును పరిశీలించి, ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.చిలుక వాగు పొడవునా రెండు వైపులా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.  కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దారు దశరథ్‌, పురపాలక సంఘం కమిషనర్‌ తేజిరెడ్డి, నీటి పారుదల శాఖ ఏఈ నిఖేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.