close

ఆదివారం, జులై 21, 2019

ప్రధానాంశాలు

బాబోయ్‌ వసతి గృహాలు.. ఆరోగ్యానికి తూట్లు! 

కలుషిత నీరు, ఆహారంతో ముప్పు 
తరచూ అనారోగ్యం పాలవుతున్న వైనం 
ప్రమాణాలు పాటించని వసతి గృహాలు 
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలోని కొన్ని వసతి గృహాలు అపరిశుభ్రతకు చిరునామాగా మారుతున్నాయి. తరచూ నీరు, ఆహార కాలుష్యంతో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వసతిగృహాలు ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలోని కమలా నెహ్రూ పాలిటెక్నికల్‌ కళాశాల వసతిగృహం విద్యార్థినులు కలుషిత నీరు, ఆహారంతో ఆసుపత్రి పాలుకావడం చూస్తే... వీటి నిర్వహణ తీరు ఎలా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు నూరు మంది విద్యార్థినులు అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరారు. 
స్మానియా ఆసుపత్రి నర్సింగ్‌ హాస్టల్‌లో అపరిశుభ్రత వల్ల దోమలు వృద్ధి చెంది గతంలో ఇద్దరు విద్యార్థినులు డెంగీతో మృతి చెందారు. కలుషిత ఆహారం వల్ల మరో 10 మంది నర్సింగ్‌ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. తరచూ ఏదో ఒకచోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. కూకట్‌పల్లి, మాదాపూర్‌, గచ్చిబౌలి, సనత్‌నగర్‌, అమీర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వందల కొద్ది ప్రైవేటు వసతి గృహాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, నర్సింగ్‌, పాలిటెక్నికల్‌ కళాశాలలు ఇతరత్రా అనేక రకాల వసతి గృహాలు ఉన్నాయి. ఒక్కసారి క్షేత్రస్థాయిలో వీటి పరిస్థితి చూస్తే.. అసలు ఇవి వసతి గృహాలేనా అన్న సందేహం కలగక మానదు. ఉద్యోగాలు, ఉపాధితోపాటు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది విద్యార్థులు, విద్యార్థినులు వస్తుంటారు. నగరంలో అవివాహితులకు ఇళ్లు అద్దెకు ఇవ్వడం కొంత కష్టమే. అదేవిధంగా ఒంటరిగా పనిచేసే మహిళలు కూడా ఇళ్లు అద్దెకు తీసుకోవడం కష్టమే. రకరకాల కారణాలతో చాలా మంది బ్యాచిలర్స్‌కు అద్దెకు ఇచ్చేందుకు ఇష్టపడరు. ప్రభుత్వ ఆధ్వర్వంలోని వృత్తి విద్యా కోర్సులు చదివేందుకు అనేకమంది ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటుంటారు. చాలా వసతిగృహాలు కనీస ప్రమాణాలు ఉండటం లేదు. వీటి దుస్థితిపై కూడా ఆరా తీసే నాథుడే కన్పించడం లేదు. ఏదో సంఘటన జరిగినప్పుడు కాసేపు అధికారులు హడావుడి చేయడం తర్వాత విస్మరించడం షరామామూలుగా మారింది. దీంతో వసతిగృహాల నిర్వాహకుల ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. 

ఇవీ లోపాలు... 
ప్రభుత్వ వసతి గృహాల నిర్వాహణ తీరు అధ్వానంగా ఉంటోంది. విద్యార్థులకు కేటాయించే డబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ధరలు పెరగడం వల్ల ఆ కొద్ది డబ్బులతోనే మూడు పుటలా భోజనాలు పెట్టడం కష్టంగా మారుతోంది. దీంతో ఆహార పదార్థాల విషయంలో నాణ్యత పాటించడం లేదు. 
మరిగిన నూనెను మరోసారి వంటల్లో వాడకూడదు. వసతి గృహాల్లో ఇదే నూనెను పదేపదే వాడుతున్నారు. తాజాగా కమలా నెహ్రూ హాస్టళ్లలో కూడా 20 రోజుల నుంచి ఒకే నూనె వాడుతున్నట్లు విద్యార్థినులు చెబుతున్నారు. 
వసతి గృహాల్లో వంటగదులు దారుణంగా ఉంటున్నాయి. ఆరు బయట వంటలు చేస్తున్నారు. కిచెన్‌లో ఏ మాత్రం శుభ్రత పాటించడం లేదు. వాన పడితే బురద నీటిలోనే వండుతున్నారు. ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు షరామామూలే. 
చాలా హాస్టళ్లలో పరిశుభ్రమైన నీటిని అందించడం లేదు. పైన ఉన్న ట్యాంకర్ల లో నీటినే తాగుతున్నారు. నాంపల్లిలోని కమలా నెహ్రూ వసతి గృహంలో ట్యాంకు శుభ్రం చేసి రెండేళ్లు దాటింది. ఎన్నిసార్లు విద్యార్థినులు కోరిన ఫలితం మాత్రం లేదు. దీంతో తాగే నీళ్లు కలుషితమవుతున్నాయి. 
గదుల్లో పరిమితికి మించి కుక్కుతున్నారు. ప్రైవేటు హాస్టళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రైవేటులో ఒక్కో వ్యక్తి నుంచి కనీసం అయిదారు వేలు వసూలు చేస్తున్నారు. ఆ మేరకు మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రత్యేక గది కావాలంటే రెండింతలు ఫీజులు చెల్లించాలి. 
భోజనం విషయంలో కనీస నాణ్యత పాటించడం లేదు. వంటల్లో అధికంగా కారం, ఉప్పు వేయడం...ఎలాంటి రుచి లేకుండా వండి వారుస్తున్నారు. ఇలాంటివి తినడం వల్ల తక్కువ రోజుల్లోనే అనారోగ్యం పాలవుతున్నారు. 
పరిశుభ్రమైన నీటిని అందించాలి. ప్రభుత్వ వసతి గృహాల్లో అసలు పాటించడమే లేదు. కనీసం కాచి, చల్లార్చిన నీళ్లు ఇచ్చినా సరే ఎంతో ఉపయోగం. ఆ పనిచేయడం లేదు. నేరుగా ట్యాంకర్లలోని నీటిని తాగడానికి ఇవ్వడం వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. 
కలుషిత ఆహారం, నీళ్లు తీసుకోవడం వల్ల డయేరియా, కలరా, పచ్చకామెర్లు, టైఫాయిడ్‌ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాగిన నూనె పదేపదే వినియోగించడం ప్రమాదమే.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.