close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

రూపాయికే బీమా... రైతన్నకు ధీమా

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం

రూపాయి రుసుముతో నమోదుకు అవకాశం

ఈ ఖరీఫ్‌ నుంచే అమలు రబీ నాటికి

ఏపీ వ్యవసాయ పంటల బీమా సంస్థ ఏర్పాటు

2018 ఖరీఫ్‌లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద 1,35,512 మంది సాగుదారులు నమోదు చేసుకున్నారు. రూ. 22.301 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లించారు. వీరికి రూ.80 కోట్ల క్లెయిమ్‌ నమోదైంది. వ్యవసాయ ఆధారిత బీమా కింద 55,268 మంది రైతులు రూ.8.487 కోట్లు బీమా చెల్లించారు. వీరికి రూ.123.6315 కోట్ల క్లెయిమ్‌ నమోదైంది.

2018-19 రబీలో 1,35,512 మంది రైతులు రూ.10.274 కోట్ల ప్రీమియం చెల్లించారు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ప్రకృతి వైపరీత్యాలు రైతు నడ్డి విరుస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా ఆరుగాలం శ్రమించిన అన్నదాత ఆశల సేద్యం అచ్చిరాక అప్పుల పాలవుతున్నాడు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండుతూ అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం కొంత అండగా నిలుస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కర్షక శ్రేయస్సు కోసం సరికొత్త బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు జీవో 62ను జారీ చేసింది. పుడమి పుత్రులకు అండగా నిలుస్తూ వైఎస్సార్‌పంటల బీమా పథకాన్ని ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సాగులో ఉన్న ప్రతి ఎకరానికి ప్రీమియం చెల్లించేందుకు నిధులు కూడా అందుబాటులో ఉంచుతోంది.

ఉచిత పంటల బీమా పథకం ఇలా..

అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సరికొత్త బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. రైతు ప్రయోజనార్థం ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పుడమిపుత్రులు నామమాత్రంగా రూపాయి చెల్లించి పేరు నమోదు చేయించుకుంటే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ ఖరీఫ్‌ నుంచి రైతన్నలకు అందుబాటులోకి తేనుంది. భవిష్యత్తు అవసరాల దృష్టా వ్యవసాయ పంటల బీమా సంస్థను ఏర్పాటు చేసి ఈ ఏడాది రబీ నాటికి అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రతి ఎకరాకు వర్తింపు

బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న వారితో పాటు రుణాలు పొందని రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. రైతు ఒక్క రూపాయి నామమాత్రపు రుసుము చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. బ్యాంకుల ద్వారా ప్రీమియం చెల్లించే రైతులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రైతులు చెల్లించిన మొత్తాన్ని వారి బాంకు ఖాతాల్లో జమచేస్తారు. వాస్తవంగా పంటల సాగు ఎంత ఉంటే అంత బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. పంట రుణాలు తీసుకోని రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా ఒక రూపాయి చెల్లించి పేరు, సాగు చేసిన పంట, విస్తీర్ణం, భూమి వివరాలు నమోదు చేయించుకుంటే చాలు.

వ్యవసాయ బీమా సంస్థ ఏర్పాటు

రైతు భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఈ ఏడాది రబీ నాటికి వ్యవసాయ బీమా సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా బీమా సంస్థను ఏర్పాటు చేస్తే ఇతర సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన ఆగత్యం తప్పుతుంది. పరిహారం విడుదలపై నిర్ణయం సర్కారు చేతిలోనే ఉంటుంది.

రుసుం తిరిగి చెల్లింపు

ఈ ఏడాది పంటల రుణాలు పొంది ప్రీమియం చెల్లించిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఖరీఫ్‌ సాగు దృష్ట్యా కొందరు రైతులు ఇప్పటికే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. మే, జూన్‌ నెలల్లోనే పాత రుణాలకు వడ్డీలు చెల్లించి కొత్తవాటిగా మార్చుకోవడం ప్రారంభించారు. వీరందరి నుంచి పంటల వారీగా ప్రీమియం రుసుమును బ్యాంకర్లు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని వెనక్కు ఇవ్వనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి - సాలురెడ్డి, ఏడీఏ

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రూపాయి పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకు జీవో 62ను విడుదల చేసింది. ఇప్పటికే ప్రధాన మంత్రి ఫసల్‌ బీమాపై రైతుల్లో అవగాహన కల్పించాం. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల ప్రీమియం బ్యాంకర్లు చెల్లిస్తున్నారు. రుణం తీసుకోనివారు నేరుగా మీసేవా కేంద్రంలో ఒక రూపాయి చెల్లించి పేరు నమోదు చేయించుకోవాలి.

రైతులకు ప్రయోజనం - దినకర్‌, రైతు, కరివేన

వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏటా రైతులు ఏదో రూపంలో నష్టపోతున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోనివారు, చాలా మంది ప్రీమియం చెల్లించట్లేదు. ప్రభుత్వమే రైతుల ప్రీమియం చెల్లించేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం. బీమా చేసినా పరిహారం అందక సాగుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వమే సొంతంగా బీమా సంస్థను ఏర్పాటుచేయనుండటం హర్షణీయం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.