రాష్ట్రం ఏదైనా.. సరకులు ఇక్కడే - Nizamabad - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

రాష్ట్రం ఏదైనా.. సరకులు ఇక్కడే

కేంద్రం నిర్ణయంతో మరింత పారదర్శకత

ఇతర ప్రాంతాలకు చెందిన 20 వేల మందికి ప్రయోజనం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

‘‘ నిజామాబాద్‌ జిల్లాలో ఇటుక బట్టీలు, కార్మిక సంస్థల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వారు వేలల్లోనే ఉన్నారు. ప్రధానంగా ఏపీలోని ఉభయ గోదావరి, శ్రీకాకుళం.. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తాత్కాలికంగా జీవనం సాగిస్తున్నారు. వీరందరికి తమ స్వస్థలాల్లో ఆహార భద్రత కార్డులు ఉన్నా..వాటిపై సరకులు పొందలేని పరిస్థితి. ఇకమీదట ఈ కార్డులపై స్థానికంగానే నెలనెలా రేషన్‌ కోటాను జారీ చేయనున్నారు ’’

‘‘ కామారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇళ్ల నిర్మాణం, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వారంతా ఇతర రాష్ట్రాల వారే. వీరందరికి స్థానికంగా ఆహార భద్రత కార్డులు లేకపోగా.. స్వస్థలాల్లో ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఇకపై వీరందరి సమస్య తీరనుంది ’’

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

దేశం మొత్తంలో ఎక్కడైనా రేషన్‌ సరకులు పొందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది. లబ్ధిదారులు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఒక్కసారి అందుకొన్న ఆహార భద్రత కార్డుతో ఎక్కడైనా తమ కోటాను పొందొచ్ఛు ఇందుకోసం ప్రయోగాత్మకంగా పలు రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఇప్పటికే మన రాష్ట్రంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. నిజామాబాద్‌, కామారెడ్డిలోనూ సెప్టెంబరు నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం.

ఇదీ పరిస్థితి

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 1,331 రేషన్‌ దుకాణాలున్నాయి. ప్రతినెల 14 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కోటా పంపిణీ అవుతోంది. ఇప్పటికే ఈ-పాస్‌ విధానంతో రాష్ట్రంలో ఎక్కడైనా సరకులు పొందే వెసులుబాటు కలిగింది. ఈ నిర్ణయం ద్వారా ఉభయ జిల్లాల్లో సుమారు 40 వేల పైచిలుకు కార్డుదారులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతున్నారు.

ఒకే గొడుగు కిందకు...

దేశంలో ఏ మూలన ఉన్నా తమకు అందే కోటాను ప్రతినెల పొందొచ్ఛు ప్రజా పంపిణీ వ్యవస్థను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకొన్న కేంద్రం అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉభయ జిల్లాల్లో రేషన్‌ దుకాణాల్లోని ఈ-పాస్‌ యంత్రాలకు అదనపు సాంకేతికతను జోడించే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే దేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారికైనా సరకులు అందజేస్తారు. ఇందుకు ఆయా లబ్ధిదారులు తమ ప్రాంతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డు, ఆధార్‌ గుర్తింపును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది.

20 వేలకు పైగానే..

ఉభయ జిల్లాల్లో మన రాష్ట్రం మినహా ఇతర ప్రాంతాలకు చెందిన వారు వేలల్లోనే నివాసం ఉంటున్నారు. వీరిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉండి.. తమ ప్రాంతాల్లో కార్డులు కలిగినవారు 20 వేల పైచిలుకు ఉంటారని సమాచారం. ఇలాంటివారిలో చాలా మంది ప్రతి మూడు నెలలకోసారి తమ ప్రాంతాలకు వెళ్లి బియ్యం ఇతర సరకులు తెచ్చుకొంటున్నారు. తాజా నిర్ణయంతో వీరికి ఈ తిప్పలు తప్పనున్నాయి.

పక్కదారి పట్టకుండా..

చాలా మంది తమ ప్రాంతాల్లో కార్డు కలిగి ఉన్నా.. స్థానికంగానూ కార్డులు తీసుకున్న దాఖలాలున్నాయి. తాజా నిర్ణయం ద్వారా ఆధార్‌ కార్డు అనుసంధానంతో బోగస్‌ కార్డులు వెలుగులోకి రానున్నాయి. తద్వారా సరకులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట పడనుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.