చిన్నబోయిన నీటి వనరులు - Nizamabad - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

చిన్నబోయిన నీటి వనరులు

 తూముల లీకేజీతో నీటి వృథా

 చెరువుల పర్యవేక్షణలో డొల్లతనం

ఈనాడు, నిజామాబాద్‌

చిన్ననీటి వనరులకు పూర్వవైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం అమలు లోపభూయిష్టంగా మారింది. ఐదేళ్ల ప్రణాళికలతో నీటిపారుదలశాఖ ముందుకెళ్లినప్పటికీ నిర్దేశించుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. తూములు, కాల్వల మరమ్మతులు గాలికొదిలేయటంతో చెరువుల్లోకి చేరిన నీరు కాస్త వృథాగా పోతోంది.
చెరువుల్లో పూడిక తొలగింపు, కట్టలను బలోపేతం చేయటం, తూములు, తలుపుల(షెట్టర్ల) మరమ్మతులకు మిషన్‌ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లుగా విడతల వారీగా పనులు చేపడుతూ వచ్చారు. సర్వే చేసి చెరువులను ఎంపిక చేశారు. ఆ ప్రకారం అభివృద్ధి పనులు ప్రారంభించారు. మొదటి విడతలో జరిగిన విధంగా ఆ తర్వాత కాలంలో చేపట్టలేకపోయారు. సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, రాజకీయ పలుకుబడి ఉన్నవారు పనులు చేజిక్కించుకోవటంతో అడిగే వారు లేకుండా పోయారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యమూ ప్రగతిపై ప్రభావం పడింది. కాళేశ్వరం జలాలు వచ్చేనాటికి చెరువులన్నీ పునరుద్ధరణ జరిగితేనే నీటితో నింపుకొనే అవకాశం ఉంటుంది.
అంతా గోప్యత..
పనులు జరిగిన తీరు.. పూర్తి చేసిన వివరాలు పూర్తిస్థాయిలో చెప్పడానికి అధికారులు సంకోచిస్తున్నారు. అనుభవం లేని రాజకీయ నాయకులు గుత్తేదారులుగా మారి నాణ్యతగా పనులు చేపట్టకపోవడంతో సమస్య నెలకొందని పలు గ్రామాల రైతులు చెబుతున్నారు.
సిబ్బంది కొరతకు తోడు బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతున్న క్రమంలో గుత్తేదారులను ఏమీ అనలేని స్థితిలో ఉండిపోయామని ఓ అధికారి చెప్పుకొచ్చారు.
ఇంకా అసంపూర్తిగానే..
నీటి వనరుల అభివృద్ధి లక్ష్యం.. మిగిలున్న పనుల వివరాలను పరిశీలిస్తే అధికారులు గత నెల 15వ తేదీ వరకు రికార్డు చేశారు. వాటిల్లో చాలా చోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. వర్షాలు  ప్రారంభమైన నేపథ్యంలో కొనసాగించే పరిస్థితి లేదు. అసంపూర్తి పనులు.. గుత్తేదారుడికి చెల్లించే బిల్లుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనేది స్పష్టత లేదు.

లీకేజీలతో నీరు వృథా
ఎడపల్లి మండలం జానకంపేటలోని రథం, ఎడపల్లి పులి చెరువుల తూములు, షెట్టర్లు దెబ్బతిని నీరు వృథా అవుతోంది. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా వీటిని అభివృద్ధి చేసినట్లు అధికారులు చెబుతున్నా.. వర్షానికి వీటిల్లో చేరిన నీరు నిలిచే పరిస్థితి లేకుండా ఉంది. ఎడపల్లి పెద్ద, జంలం చెరువుల కట్టలు పటిష్ఠ పరిచినట్లు చెబుతున్నా.. బీటలువారి కట్టమీద నుంచి నడవలేని పరిస్థితి ఉంది. ఈ సమస్యపై మండల పరిషత్‌ సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. వాటి కింద ఉన్న ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. అవసరమైన సమయంలో నీరు లభించకపోవటమే కాకుండా.. నీరు నిలవని కారణంగా భూగర్భ జలాలు ఊరని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇలాంటి చెరువులు జిల్లాలో చాలా ఉన్నాయి.
గాంధారి మండలం గుజ్జుల్‌ చెరువు భారీ విస్తీర్ణం కలిగి 1,060 ఎకరాల ఆయకట్టు ఉంది. తూముల లీకేజీలు, అలుగు దెబ్బతిని, కాల్వలు పూడిపోయాయి. ప్రస్తుతం నిండు కుండలా ఉన్నప్పటికీ నీటి వృథాను అరికట్టలేని పరిస్థితి. ఆయకట్టు రైతులంతా గిరిజనులు. మిషన్‌ కాకతీయలో అభివృద్ధి చేయాలని సర్వే చేశారు. తర్వాత కాళేశ్వరం పనుల్లో భాగంగా కటెవాడ, గుజ్జుల్‌ చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ధి చేస్తామని నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పారు. ఆ ప్రణాళికలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. చెరువులోని నీరు వృథాగా పోతుండటంతో ఆయకట్టు సాగు ఆగమాగంగా ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.