పర్యటక క్షేత్రం.. పార్కింగ్‌కు లేదు స్థలం  - Hyderabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

పర్యటక క్షేత్రం.. పార్కింగ్‌కు లేదు స్థలం 

లుంబినీ పార్కు సందర్శకుల అవస్థలు 
  వాహనాలను నిలిపేందుకు చోటు కరవు 
  రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ జామ్‌తో తిప్పలు

ఉదయం లుంబినీ పార్కును చేట్టేసి.. మధ్యాహ్నం సాగర్‌లో అలా అలా.. బోటు షికారు చేసి.. సాయంత్రం లేజర్‌ షోను తిలకించేందుకు వస్తున్న సందర్శకులను ‘పార్కింగ్‌’ తిప్పలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. లుంబినీ పార్క్‌లో పార్కింగ్‌ స్థలాన్ని ఎత్తేయడంతో వాహనాలను ఎక్కడ నిలపాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ప్రధాన మార్గంపైనే వాహనాలను నిలిపేస్తుండటంతో రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ పెరిగి అటువైపు వెళ్లే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నగరంలో కాసేపు సేద తీరేందుకు నగరవాసులు.. మధుర అనుభూతులను సొంతం చేసుకునేందుకు దేశ, విదేశీ అతిథులు నెక్లెస్‌ రోడ్డుకు వస్తుంటారు. ఏటా ఒక్క నెక్లెస్‌ రోడ్డుపై ఉన్న పార్కులు, ఇతరత్రా కార్యకలాపాలతోనే హెచ్‌ఎండీఏకు చెందిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ(బీపీపీఏ)కి రూ.24 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. నగరం నడి బొడ్డున.. సచివాలయానికి ఎదురుగా ఉండటంతో లుంబినీ పార్కుకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సెలవు దినాలు, శని, ఆదివారాల్లో రద్దీ అంతా ఇంతా కాదు. కాసేపు పార్కులో ఆహ్లాదకరంగా గడిపి అక్కడి నుంచి హుస్సేన్‌ సాగర్‌లో బోటింగ్‌కు వెళ్లి లేజర్‌ షోను వీక్షిస్తారు. సాధారణ రోజుల్లో లేజర్‌ షోకు 500 మంది వరకు, శని, ఆదివారాల్లో వెయ్యి మంది వరకు హాజరవుతుంటారని అధికారులు పేర్కొంటున్నారు.

3.29 ఎకరాల అప్పగింత.. 
భాగ్య నగరంలో పార్కింగ్‌ తిప్పలు అన్నీ ఇన్నీ కావు.. ఇదే సమస్య తొమ్మిది.. పది నెలలుగా లుంబినీ పార్క్‌ సందర్శకులను వెంటాడుతోంది. వాస్తవానికి దేశ, విదేశీ ప్రతినిధులు ఎక్కువగా బస్సులు, కార్లలోనే ఇక్కడికి వస్తుంటారు. పార్కింగ్‌ చేసుకోవడానికి కావాల్సినంత స్థలముండేది. ఈ పార్కు పక్కనే తెలంగాణ అమరవీరుల స్మృతివనాన్ని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకుగాను లుంబినీ పార్కులో పార్కింగ్‌కు కేటాయించిన 3.29 ఎకరాలను బీపీపీఏ నుంచి స్వాధీనం చేసుకుంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌కు కనీస స్థలం కరవైంది. స్థలం లేకపోతే మేమేం చేస్తామంటూ బీపీపీఏ అధికారులు చేతులెత్తేశారు. వాహనాలను నిలుపుకొని సందర్శకులు దిగే పరిస్థితి కూడా లేదు.

మింట్‌ కంపౌండ్‌లో నిలిపి.. 
కొందరు సందర్శకులు మింట్‌ కంపౌండ్‌లో వాహనాలను పార్క్‌ చేసి అక్కడి నుంచి లుంబినీ పార్క్‌ వరకు నడుచుకుంటూ వస్తున్నారు. మరి కొందరేమో  సమీపంలోని ఖాళీ స్థలాల్లో నిలుపుతున్నారు. ఇంకొందరేమో సచివాలయం ఎదురుగా ఉన్న ప్రధాన మార్గంపైనే నిలిపేస్తున్నారు. సాధారణంగా సాయంత్రం సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళుతుంటారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రతి రోజు వందలాది సందర్శకులు ఇబ్బంది పడుతున్నా బీపీపీఏ అధికారులు మాత్రం    నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

కొన్ని నెలలు తప్పదు బీపీపీఏ అధికారులు 
కొన్ని నెలల వరకు సందర్శకులకు పార్కింగ్‌ తిప్పలు తప్పవు. లుంబినీ పార్కును సందర్శించే వారి సౌకర్యార్థం ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పించాం. అమరవీరుల స్మృతివనం నిర్మాణం పూర్తయితే ఎలాంటి తిప్పలు ఉండవు. అదే భవనంలో 200 నుంచి 300 వరకు కార్లు, బస్సులు, 500 నుంచి 600 వరకు ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.