హాస్య చెణుకులు.. నవ్వుల జల్లులు - Hyderabad - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

హాస్య చెణుకులు.. నవ్వుల జల్లులు

నగరంలో విస్తృతమవుతోన్న కార్యక్రమాలు
ప్రత్యేక శైలితో రాణిస్తోన్న స్టాండప్‌ కమెడియన్లు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

సృష్టిలో నవ్వగలిగే అదృష్టం కేవలం మనుషులకు మాత్రమే ఉంది. నిత్య జీవితంలోని ఒత్తిడిని అధిగమించేందుకు హాయిగా, ఆనందంగా నవ్వడం ఒక ఔషధంగా ఉపకరిస్తుంది. అందుకే ఎక్కడికక్కడ లాఫింగ్‌ క్లబ్‌లు కనిపిస్తుంటాయి. హాస్యవల్లరిలు సరేసరి. గత కొన్నాళ్లుగా స్టాండప్‌ కామెడీల పోకడ భాగ్యనగరంలో విస్తృతమవుతోంది. కాసేపు నవ్వుల ప్రపంచంలో ఓలలాడించి సేదదీరుస్తున్నాయి. ప్రతీ వారం సుమారు 15 కార్యక్రమాలు ఈ తరహావే ఉంటున్నాయి. వ్యక్తిగతంగా, సమూహంగానూ ఏర్పాటవుతున్నాయి.

స్టాండప్‌ కామెడీ ఓ చక్కని కళ. ఎవరినీ నొప్పించకుండా ఇతరులను నవ్వించడం పెద్ద సవాలే. ఎప్పుడూ వినని జోకులు చెబుతూ, కొన్ని సందర్భాలను వివరిస్తూ చమత్కారాన్ని జోడించడానికి పెద్ద కసరత్తే చేయాలి. వర్తమాన అంశాల ఆధారంగా హాస్యాన్ని పుట్టించడం, సినిమా కబుర్లు, పుకార్లు, స్నేహితులతో కలిసి చేసే చిలిపి పనులు, బంధువుల మనస్తత్వాలు, పాఠశాలలో సన్నివేశాలు, ఇంట్లో తల్లిదండ్రులతో అనుబంధం, తరగతి గదుల్లో సన్నివేశాలు, ప్రేమికుల ఇక్కట్లు, ప్రభుత్వ పథకాలు ఇలా ఎన్నో అంశాలు ఈ స్టాండప్‌ కామెడీలో వస్తువులే. ఈ అంశాలపై ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటే తప్ప అన్ని వర్గాల ప్రేక్షకులను ఓలలాడించడం సాధ్యం కాదు. అదే పనిచేస్తున్నారు నగరానికి చెందిన కమెడియన్లు.

మంగళ, గురువారాల్లో ఓపెన్‌ మైక్‌
వారాంతాలు మినహాయించి మిగతా రోజుల్లో ఓపెన్‌ మైక్‌ను హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్నారు. ఎవరైనా హాజరై కామెడీ షోలను ఉచితంగా తిలకించవచ్చు. ప్రతిభ ఉన్నవారు పాల్గొనవచ్చు. పలువురు హాస్యకారులు వారి స్క్రిప్టును ఇక్కడ ప్రదర్శించే అవకాశమూ ఉంది. ఇదే సమయంలో అక్కడి ప్రేక్షకుల స్పందన ఆధారంగా ఎడిటింగ్‌ చేసుకోవడం, అదనంగా పంచ్‌లను చేర్చుకోవడం వంటివి సాధన చేస్తుంటారు. ఈ ఓపెన్‌మైక్‌ కార్యక్రమాలు మంగళవారం కొండాపూర్‌లోని బరిస్టా కాఫీషాప్‌, గురువారం జూబ్లీహిల్స్‌లోని చిట్‌చాట్‌ ఛాయ్‌లో జరుగుతున్నాయి. వారాంతాల్లో వివిధ ప్రాంతాల్లో జరిగే స్టాండప్‌ కామెడీ షోలకు మాత్రం టిక్కెట్‌ కొనుక్కొని వెళ్లాల్సి ఉంటుంది.

ఎక్కువగా ఆ ప్రాంతాల్లో..

సంస్కృతి ముంబయి, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో మొదలై హైదరాబాద్‌కు విస్తరించింది. కార్యక్రమాల్లో పాల్గొనేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నెలలో 60-80 వరకు ఏర్పాటవుతున్నాయి. హెచ్‌ఐసీసీ, హైటెక్‌సిటీ, కొండాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మణికొండ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఎక్కువ... ఒక్కో ఈవెంట్‌కు రూ.120 నుంచి రూ.1500 వరకు ఛార్జి చేస్తున్నప్పటికీ వీక్షకుల సంఖ్య తగ్గడం లేదు. నగరంలో 20 మందికి పైగా స్టాండప్‌ కమెడియన్లు ఉన్నారు. అవినాష్‌ అగర్వాల్‌, రోహిత్‌ స్వైన్‌, సాయికిరణ్‌, హ్రిదయ్‌రంజన్‌, రాజశేఖర్‌ మామిడన్న, సందేశ్‌జానీ తదితరులెందరో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారూ ఎక్కువే.

మహిళలు సైతం..

స్టాండప్‌ కామెడీ రంగంలోకి మహిళలూ వస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ సుముఖితో పాటు మరికొందరు గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ప్రదర్శనలు ఇస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మనవాళ్లూ ఓపెన్‌ మైక్‌ ద్వారా తమ సామర్థ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.

స్పందన బాగుంది.. 
సుముఖి సురేశ్‌, స్టాండప్‌ కమెడియన్‌

వేదికలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కొత్తవారు ఈ రంగంలోకి వస్తుండటం సంతోషించదగ్గ విషయం. వీక్షకుల సంఖ్య అధికమే. మహిళా స్టాండప్‌ కమెడియన్లు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. కళాకారులు అనేక హావభావాలు ప్రకటించాలి. అప్పుడే ప్రేక్షకుల్లో నవ్వు చిగురిస్తుంది. యువతీ, యువకులే ఎక్కువగా ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మున్ముందు నగరంలో ఈ రంగం మరింత విస్తృతం కానుంది.

ప్రతీ ఒక్కరికి ప్రత్యేక శైలి
 సందేశ్‌ జానీ, స్టాండప్‌ కమెడియన్‌

రిశీలనా శక్తి ఉంటేనే విజయవంతమైన స్టాండప్‌ కమెడియన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికీ ఒక్కో పద్ధతి, శైలి ఉంటాయి. వర్తమాన అంశాలు, నిజ జీవిత ఘటనలు, ప్రముఖుల జీవితంలోని సంఘటనలను అనుసంధానం చేస్తూ చమత్కారాన్ని జోడించాలి. ఎవరినీ నొప్పించకుండా ఆరోగ్యకర హాస్యాన్ని పండించాలి. కొంతమంది రాజకీయ చెణకులు, చిన్ననాటి విషయాలతో నవ్వుల్ని పూయిస్తారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.