close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

చెరువులకు చేరని చేప

ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే


చేపపిల్లలను వదులుతున్న దృశ్యం(పాతచిత్రం)

మత్స్యకారులకు ఉపాధి కల్పించే చేపపిల్లలు చెరువుకు చేరడం లేదు. వర్షాలు ఆలస్యంగా కురవడం, చేపపిల్లల ధరల నిర్ణయానికి సంబంధించిన టెండర్లు రద్దు కావడం, తదితర కారణాలతో ఈ ఏడాది చెరువుల్లో చేపపిల్లలు వదిలే కార్యక్రమం వేగంగా జరగడం లేదు. ఆలస్యంగా వదిలితే వేసవి వరకు చెరువుల్లో చేపపిల్లలను పెంచాల్సి ఉంటుంది. అప్పటివరకు అవి చెరువుల్లోనే ఉంటే తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా మృత్యువాత పడి నష్టం జరిగే అవకాశముందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 45 మత్స్య కార్మిక సంఘాలు ఉన్నాయి. సంఘాల్లో సభ్యులు 2,574 మంది ఉన్నా చేపల ద్వారా ఆరువేల మంది ఉపాధి పొందుతున్నారు. ఏటా కొంత లక్ష్యాన్ని పెంచుతున్న అధికారులు వాటిని సకాలంలో చెరువుల్లో వదలకపోవడంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి జిల్లాలో ఉన్న రెండు జలాశయాలతో పాటు 191 చెరువులు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చెరువుల సంఖ్యను పెంచడంతో పాటు లక్ష్యాన్ని 123.61 లక్షలుగా నిర్దేశించారు. వంద శాతం రాయితీపై సరఫరా చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చెరువుల్లో వదులుతున్నారు. జిల్లా మొత్తంలో ఈ ఏడాది రెండు పరిమాణాలున్న చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 35-40 మి.మీ. పరిమాణంతో పాటు 82-100 మి.మీ.తో ఉన్న చేప పిల్లలను కొనుగోలు చేసి వంద శాతం రాయితీపై చెరువుల్లో వదలనున్నారు.

చేపపిల్లల పంపిణీలో జాప్యం

చేపపిల్లల పంపిణీకి రాష్ట్ర స్థాయిలోనే టెండర్లు పిలుస్తారు. అయితే వ్యాపారులు మార్కెట్‌ ధర కంటే ఎక్కువ ధరతో టెండర్లు వేయడంతో ఉన్నతాధికారులు వాటిని రద్దు చేశారు. తిరిగి టెండర్లు పిలిచి ధరలు ఖరారు చేశారు. మరో వైపు వర్షాలు ఆలస్యంగా కురవడంతో చెరువుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. ఇప్పటికి ఇంకా 20 చెరువులు చేపపిల్లలు వదిలేందుకు అనుకూలంగా లేవని అధికారులు తెలిపారు. నీరు ఉన్న 171 చెరువుల్లో చేపపిల్లలను వదులుతున్నారు. ఇప్పటివరకు 40 లక్షలు మాత్రమే వదిలారు. ఎక్కువ మొత్తంలో తలమడుగు మండలంలోని 21 చెరువుల్లో 12.88 లక్షలు, ఉట్నూరులోని 25 చెరువుల్లో 12.97, ఇంద్రవెల్లి మండలంలోని 22 చెరువుల్లో 9.79 లక్షల చేపపిల్లలు వదలాలి. సాత్నాల ప్రాజెక్టులో 9.94, మత్తడివాగు రిజర్వాయర్‌లో 5.84 చేపపిల్లలు వదలాల్సి ఉంది.

పెరగడం లేదంటున్నారు

చెరువుల్లో వదిలే చేపపిల్లల్లో రెండు పరిమాణాల్లోవి వదలాలి. పూర్తిగా నీటితో నిండిన చెరువులల్లో 45 రోజుల వయస్సు ఉన్న 35-40 మి.మీ పొడవు ఉన్న చేపపిల్లలు వదలాల్సి ఉంటుంది. ఏడాది మొత్తం నీరు ఉండే పెద్ద చెరువులు, జలాశయాల్లో 75రోజుల వయసుతో ఉన్న 80-100 మి.మీల పొడవు ఉన్న చేపపిల్లలు వదలాల్సి ఉండగా, సైజులతో సంబంధం లేకుండా చిన్న పరిమాణంతో ఉన్న చేపపిల్లలు ఎక్కువ వదులుతున్నారని మత్స్యకారులు అంటున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే చేప పిల్లల రకాలకు డిమాండ్‌ ఎక్కువ లేదని అంటున్నారు. పైగా చెరువుల్లో వదిలే పిల్లల సంఖ్య తక్కువగా ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. చేపపిల్లలను నీటిలో వదిలిన తరువాత కిలోసైజులో చేప కావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. సెప్టెంబర్‌ నెలలో వదిలితే అవి కిలో సైజుకు రావాలంటే జనవరి నెల వస్తుంది. ఇంకా పెరగాలంటే వేసవి కాలం వచ్చేస్తుంది. ఉష్ణోగ్రతల కారణంగా చేపలు నీటిలోనే చనిపోయే అవకాశం ఉందని మత్స్యకారులు అంటున్నారు.

ఈ నెలాఖరులోగా పూర్తి

వై. విజయ్‌కుమార్‌, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు

జిల్లాకు సరఫరా చేసే చేపపిల్లల ధరలు ఖరారు కావడం, చెరువుల్లోకి నీరు రావడంలో జాప్యం కావడంతో చేపపిల్లల పంపిణీలో కొంత ఆలస్యం అయింది.. ఈ నెలాఖరులోగా మొత్తం పక్రియ పూర్తవుతుంది. జిల్లాలో 20 చెరువులు నీరు లేక.. చేపపిల్లల పెంపకానికి అనువుగా లేవు. నీరు నిండితే చివరి వరకు వాటిలో కూడా వదులుతాం. గతంలో ఎదురైన లోపాలను సవరించుకుంటూ, మత్స్యకార్మికులు లబ్ధి పొందేలా చూస్తాం. నిర్ణయించిన పరిమాణాన్ని బట్టి చేపపిల్లలు వదిలేలా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మత్య్సకారుల సంఘాలు- 45

సభ్యులు- 2,574

చెరువులు- 191

నీటితో ఉన్న చెరువులు- 170

నీళ్లు లేని చెరువులు- 21

ఈ ఏడాది లక్ష్యం- 123.61లక్షలు

ఇప్పటివరకు వదిలినవి- 40 లక్షలు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.