close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

వినూత్న కళ.. వినయ్‌ సొంతం

 ప్రత్యేకతను చాటుతున్న సిర్పూర్‌(టి) యువకుడు

● సూక్ష్మ చిత్రలేఖనంలో జాతీయ స్థాయిలో ప్రతిభ

● ఇండియాస్‌ షైనింగ్‌ స్టార్‌ పురస్కారానికి ఎంపిక

సిర్పూర్‌(టి), న్యూస్‌టుడే :


వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధి చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న దుర్గం వినయ్‌కుమార్‌(దాచిన చిత్రం)

పెన్సిల్‌ లెడ్‌లపై వినయ్‌కుమార్‌ రాసిన కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం


తంగెడు ఆకులపై తెలంగాణ ఉద్యమ చరిత్ర (దాచిన చిత్రం)

అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడం లక్ష్యం

- దుర్గం వినయ్‌కుమార్‌

ఆ యువకుడు అందరు వెళ్లే దారిలో వెళితే ఏం మజా ఉంటుందని అనుకున్నాడు. తనను అందరూ గుర్తించాలని తపన పడ్డాడు. దాని కోసం కొత్త మార్గం ఎంచుకున్నాడు. ఎన్నో పురస్కారాలు దక్కించుకున్నాడు. తంగెడు ఆకులపై తెలంగాణ ఉద్యమ చరిత్ర రాసి అద్భుతం అనిపించాడు. నువ్వుల గింజలపై జాతీయ గీతం రాసి దేశభక్తిని చాటుకున్నాడు. చింతాకులపై హన్మాన్‌ చాలీసా రాసి స్థానిక టోంకిని సిద్ధి హన్మాన్‌ దేవాలయంలో అందించాడు. అతనే సిర్పూర్‌(టి) మండలంలోని పెద్దబండ గ్రామానికి చెందిన దుర్గం వినయ్‌కుమార్‌. ఈనెల 29న ఏకంగా ఇండియాస్‌ షైనింగ్‌ స్టార్‌ పురస్కారం అందుకోనున్నారు. సూక్ష్మకళలో ప్రతిభ చాటుతున్న ఆ యువకుడిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

సిర్పూర్‌(టి) మండలంలోని పెద్దబండ గ్రామానికి చెందిన దుర్గం రావూజీ, లక్ష్మి దంపతుల రెండో కుమారుడు దుర్గం వినయ్‌కుమార్‌. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు సూక్ష్మ చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో బహుమతి సాధించాడు. తర్వాత మరింత దృష్టి సారించి ఆరితేరాడు.

నువ్వుల గింజలపై జాతీయ గీతం

నువ్వుల గింజలపై జాతీయ గీతం రాసి అందరిని అబ్బురపరిచాడు. ఒక్కో గింజపై ఒక అక్షరం రాశాడు. తన ప్రతిభ చాటుకోవడానికి ఇదే తొలి మెట్టు అయింది. పెన్సిల్‌ లెడ్‌పై జాతీయ జెండాను తయారు చేయడంతో జిల్లా స్థాయిలో గుర్తింపుతో పాటు ప్రశంసా పత్రాలను అధికారులు అందజేశారు.

చింతాకులపై హన్మాన్‌ చాలీసా

తర్వాత పలువురి ప్రోత్సాహంతో హన్మాన్‌ జయంతి సందర్భంగా చాలీసా రాయాలనే సంకల్పంతో వినూత్న కళకు పదును పెట్టారు. ఇంటి వద్ద కూర్చుని 390 చింతాకులను సేకరించి వాటిపై హన్మాన్‌ చాలీసాను పూర్తిగా లిఖించాడు. స్థానిక టోంకిని సిద్ధి హన్మాన్‌ దేవాలయంలో ప్రదర్శించడంతో భక్తులందరిని ఆకర్షించాడు.

తంగెడు ఆకులపై తెలంగాణ ఉద్యమ చరిత్ర

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అధికారిక పుష్పం తంగెడు పువ్వుగా ప్రభుత్వం ప్రకటించడంతో వాటి ఆకులపై తెలంగాణ చరిత్రను రాయాలనుకున్నాడు. ఎంతో కష్టపడి తంగెడు ఆకులను సేకరించారు. దాదాపు 23 వేల 7 వందల తంగెడు ఆకులపై ఒకటి రెండు అక్షరాలు రాస్తూ పూర్తి చరిత్రను లిఖించాడు. 1969 తొలిదశ ఉద్యమ చరిత్రతో పాటు మలి దశ తెలంగాణ అవిర్భావం వరకు జరిగిన పరిణామాలన్నింటిని ఆకులపై లిఖించాడు. రెండు నెలల పాటు కష్టపడి చరిత్రను పూర్తి చేసి ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో ప్రదర్శించాడు. ప్రతిభను గుర్తించిన వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సంస్థ (లండన్‌) అంతర్జాతీయ స్థాయి ప్రశంసాపత్రంతో బంగారు పతకం అందించారు. తర్వాత తెలుగు బుక్‌ఆఫ్‌ రికార్డు సంస్థ రాష్ట్ర స్థాయిలో ప్రశంసాపత్రాలను అందజేశారు. వజ్ర వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సంస్థ ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. ఈ అద్భుతాన్ని అప్పటి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమక్షంలో ప్రదర్శించాడు.

ఇంకా మరెన్నో అబ్బుర పరిచే అంశాలు..

అగ్గి పుల్లలపై అంబేడ్కర్‌ ఆశయాలను లిఖించాడు. నెల రోజుల పాటు కష్టపడి 3 వేల 6 వందల అగ్గిపుల్లలపై అంబేడ్కర్‌ జీవిత ఆశయాలను విజయవంతంగా లిఖించాడు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా 125 పేజీలపై అగ్గిపుల్లలను అంటించి లిఖించాడు. 2015లో రాష్ట్రం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిందని సంక్షేమ పథకాలను ప్రజలకు తన కళతో తెలపాలనే లక్ష్యంతో 6 వేల గింజలపై ప్రభుత్వ సంక్షేమాలను లిఖించి ప్రదర్శించాడు. 2019లో ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా పెన్సిల్‌ లెడ్‌పై ఆయన రాజకీయ ప్రస్థానం లిఖించాడు. 17 పెన్సిల్‌ లెడ్‌లను సేకరించి వాటిపై సూక్ష్మ చిత్రలేఖనంలో లిఖించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్వహించిన పోటీల్లో ప్రదర్శించారు.

ఇండియాస్‌ షైనింగ్‌ స్టార్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ నెల 29వ తేదీ దేశ రాజధానిలో యూత్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సంస్థ నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డు అందజేస్తారని తెలిపారు.

నేను తయారు చేస్తున్న సూక్ష్మ చిత్ర కళలను భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించాలనే లక్ష్యం ఉంది. కచ్చితంగా ప్రదర్శిస్తాననే విశ్వాసం నాకుంది. ప్రస్తుతం ఉన్నత చదువులు పూర్తి చేసి గ్రామీణ పేద ప్రజలకు నా వంతుగా సేవలందిస్తాను. గ్రామీణ ప్రాంతంలోని యువకుల్లో ఉన్న కళను వెలికి తీయడానికి కృషి చేస్తాను.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.