close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

ఇతిహాసాల సంకలనం.. తెలంగాణ వైభవం

నేటి నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, ప్రహ్లాద్‌ జోషి రాక

భారత ఇతిహాసాల ఏడు తరాల చరిత్ర తెలంగాణ పౌర సమాజానికి తెలియజేయాలనే సంకల్పంతో కరీంనగర్‌ వేదికగా తెలంగాణ వైభవం పేరుతో మూడు రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజ్ఞాభారతి, భారత ఇతిహాస సంకలన సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల కార్యక్రమానికి కరీంనగర్‌ కొండ సత్యలక్ష్మి గార్డెన్‌ వేదికగా నిలవనుంది. విభిన్న సదస్సులు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ, సాంస్కృతిక అంశాలు ప్రతిబింబించనున్నాయి. చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య విశ్లేషణలతో పాటు అధ్యయనం చేసి పత్ర సమర్పణ చేయనున్నారు. భావితరాలకు మన తెలంగాణ వైభవం చాటేలా తీర్చిదిద్దనున్నారు.

తెలంగాణ వైభవ సదస్సులను శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి రోజు ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తో పాటు ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రాజభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా శాఖ ప్రతినిధులు, వక్తలు పాల్గొంటారు. రెండో రోజు సదస్సులో కేంద్ర గనుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, మూడో రోజు ముగింపు వేడుకలకు హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

మూడు రోజులు.. ఎనిమిది సదస్సులు
* తెలంగాణ వైభవం పేరిట మూడు రోజుల పాటు జరిగే వేడుకల్లో ఎనిమిది సదస్సులు నిర్వహిస్తున్నట్లు ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రాజభాస్కర్‌రెడ్డి ప్రకటించారు.
* తెలంగాణలో దేవాలయాలు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు పద సంకీర్తన, సాంస్కృతిక, సాహిత్య లిపిశాస్త్రం అంశాలపై డాక్టర్‌ సాగి కమలాకర శర్మ, సంగనభట్ల నర్సయ్య, డాక్టర్‌ భాస్కరయోగి, డాక్టర్‌ మనోహర్‌ ప్రసంగిస్తారు.
* రెండో కాలాంశంగా విస్మరించబడిన మరుగునపడ్డ తెలంగాణ చరిత్ర అంశంపై ఎల్లాప్రగడ సుదర్శన్‌రావు, తెలంగాణ పూర్వ చరిత్ర శాతవాహనుల విజయ చరిత్ర అంశంపై కేపీ.రావు, డాక్టర్‌ రాజారెడ్డి, వి.కిషన్‌రావు ప్రసంగిస్తారు.
* మూడో కాలాంశంగా తెలంగాణ చరిత్రలో కాకతీయుల పాత్ర, శతక సాహిత్యం, తెలంగాణ కోటలు, ఆయుధాలు, తెలంగాణ చరిత్ర, ఒకటో చాళుక్యుల వంశాల చరిత్రపై డాక్టర్‌ గిరిజా మనోహర్‌బాబు, సూర్యకుమార్‌ దామరాజు, డాక్టర్‌ జైకిసాన్‌, డాక్టర్‌ కొండ శ్రీనివాసులు ప్రసంగిస్తారు.
* తెలంగాణ శాస్త్రీయత చరిత్రపై వెలుగులోకి రాని తెలంగాణ చరిత్రపై జానపద పండుగల ప్రాముఖ్యతపై డాక్టర్‌ అవధానుల జితేంద్రబాబు, సునితా రామ్మోహన్‌రెడ్డి, భానుప్రకాష్‌ ప్రసంగిస్తారు.
* తెలంగాణలో పురావస్తు ఆవిష్కరణలు, తెలంగాణలో వెల్లివిరిసిన జైనిజం, బుద్దిజం, తెలంగాణ సాగునీటి పారుదల పట్టణ అభివృద్ధి ప్రణాళికలపై సంకేపల్లి నాగేంద్ర శర్మ, డాక్టర్‌ ఉమామహేశ్వర్‌రావు, ప్రొఫెసర్‌ పాండురంగారావు, నాగరాజు ప్రసంగిస్తారు.
* తెలంగాణలో సంస్కృతి, వ్యాఖ్యానం, సంస్కృతి భాష చరిత్ర, గిరిజన సంస్కృతిపై డాక్టర్‌ శంకర్‌రావు, ప్రొఫెసర్‌ సూర్య ధనుంజయ్‌, ప్రొఫెసర్‌ రాముడు ప్రసంగిస్తారు.
* తెలంగాణ జానపద చరిత్ర కాకతీయ సామ్రాజ్య సమయంలో సామాజిక జీవనం, తెలంగాణలో వీధి నాటకాలు అంశంపై డాక్టర్‌ ఆంజనేయరాజు, ప్రొఫెసర్‌ యాదగిరి, డాక్టర్‌ కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తారు.

చారిత్రక సాక్ష్యాలుగా కళలు, సాహిత్యం
తెలంగాణ వైభవం పేరుతో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక పండుగ వాతావరణం నెలకొననుంది. విభిన్న వస్తు ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు, కళల ప్రదర్శనలు, తెలంగాణ వైభవం, సంస్కృతిని చాటే జానపద, తదితర కళాప్రదర్శనలకు వేదికగా నిలుస్తుంది. పండగ వైభవాలు చాటుతాయి.. శిల్పం వృత్తి నైపుణ్యాలు, వస్తు సంస్కృతి ఆలయాల వంటివన్నీ చారిత్రక సాక్ష్యాలుగా నిలువనున్నాయి.

తెలంగాణ వైభవాన్ని చాటిన శోభాయాత్ర
కరీంనగర్‌ సాంస్కృతికం : విచిత్ర, విభిన్న వేషధారణలు.. కోలాటాలు.. ఒగ్గుడోలు నృత్యాలు.. డప్పు నృత్యాలు.. వివిధ వృత్తుల వేషధారణలతో చేపట్టిన తెలంగాణ వైభవం సదస్సు సన్నాహక శోభాయాత్ర తెలంగాణ వైభవాన్ని చాటింది. నగరంలో వివిధ పాఠశాల విద్యార్థులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వేషధారణలతో శోభాయాత్రకు తరలివచ్చారు. వందలాది మంది విద్యార్థులు, తెలంగాణవాదులు, అభిమానులు జై జై భారత్‌.. జై హింద్‌ నినాదాలు.. గీతాలతో ఉత్సాహభరితంగా సాగింది. గురువారం ఉదయం కరీంనగర్‌ గాంధీరోడ్డులోని వైశ్య భవన్‌లో శోభాయాత్రను ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ కాషాయ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరిగే తెలంగాణ వైభవం కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జేసీ శ్యాంప్రసాద్‌ లాల్‌ మాట్లాడుతూ.. మన సంస్కృతి చాలా గొప్పదని, తరతరాల తెలంగాణ సంస్కృతికీ మనం వారసులమని చెప్పుకోవటం మనకు గర్వకారణమన్నారు. ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎల్‌.రాజభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు లోతుగా అధ్యయనం చేసి ప్రజలకు తెలియజేయాలనే కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. అనంతరం శోభాయాత్ర రాజీవ్‌ చౌక్‌, మార్కెట్‌ రోడ్డు, తెలంగాణ తల్లి విగ్రహం బస్టాండ్‌ మీదుగా తెలంగాణ చౌక్‌ వరకు అంగరంగ వైభవంగా సాగింది. డాక్టర్‌ రాజభాస్కర్‌రెడ్డితో పాటు నిరంజనాచారి, ఎ.సత్యనారాయణ, మురళీ కృష్ణ, ప్రవీణ్‌, జె.సత్యనారాయణరెడ్డి, నగేష్‌రెడ్డి, డి.శ్రీనివాస్‌, రవీందర్‌, గిరిధర్‌, రఘు, మనోహరాచారి, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు రమణారావు, అనంతారెడ్డి, తదితర పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. శోభయాత్రలో డప్పు చప్పుళ్లకు ఎద్దు బెదరడంతో కొద్దిపాటి ఆందోళన కలిగించింది.

మరిన్ని వార్తలు

అమరవీరులను ఆదర్శంగా తీసుకోవాలి

విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ సి.హెచ్‌.సింధుశర్మ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విద్యార్థినీ, విద్యార్థులకు క్విజ్‌ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశరక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎంతోమంది తమ ప్రాణాలు లెక్కచేయకుండా అసువులు బాసారని వారిని గుర్తు చేసుకునేందుకు ప్రతి ఏటా అక్టోబర్‌ 21న అమరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. గొప్ప వ్యక్తుల స్ఫూర్తితో విద్యార్థినీ, విద్యార్థులు అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో జీవితంలో విజయం సాధించాలని ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.