close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

అమ్మ ‘క్యాబో’య్‌

సమ్మె నేపథ్యంలో ఛార్జీలు మోత - పనివేళలు పట్టని క్యాబ్‌ యాజమాన్యాలు

‘‘ప్రతిరోజూ నేను అమీర్‌పేట నుంచి చింతల్‌కి క్యాబ్‌లోనే వెళ్తాను. అందుకు రూ.185 నుంచి రూ.210వరకు చెల్లించేవాడిని. కానీ మొన్న ఆర్టీసీ సమ్మె మొదలైన నుంచి రూ.390 చెల్లించాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నా’’
- వెంకటేశ్‌, ప్రయాణికుడు
‘‘శనివారం రాత్రి నేను జేబీఎస్‌ నుంచి కూకట్‌పల్లికి ఓ క్యాబ్‌లో వెళుతుండగా కాస్తలో ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ను అడగ్గా..
సార్‌ నిన్న రాత్రి నిద్రలేదు. డబ్బుల కోసం తప్పట్లేదు. రోజుకు ఎక్కువ రైడ్లు చేయాలని మాకు టార్గెట్లు ఉంటాయంటూ సమాధానమిచ్చాడు. నేను డ్రైవర్‌ను అప్రమత్తం చేయకుంటే పెద్ద ప్రమాదం జరిగేది’’
- గోవర్ధన్‌, ప్రయాణికుడు

గమ్యస్థానానికి సులువుగా చేరుకునేందుకు నగరవాసులు ఎక్కువగా ఆధారపడేది ప్రైవేటు క్యాబులపైనే. ఆర్టీసీ బస్సులు నగరంలో ప్రధాన రవాణా వనరుగా ఉండగా ఇప్పుడు కార్మికుల సమ్మెతో వాటి సంఖ్య తగ్గిపోయింది. దీంతో ప్రయాణికులు ప్రైవేటు క్యాబ్‌లపైనే ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా భావించి క్యాబ్‌ యాజమాన్యాలు ఎడాపెడా ప్రయాణ ఛార్జీలు పెంచేశాయి. దీంతోపాటు క్యాబ్‌ డ్రైవర్లకు రోజుకు పదిహేను గంటలు పనిచేయాలంటూ లక్ష్యాలను పెడుతున్నాయి. నెలకు రూ.కోట్లు ఆర్జిస్తూ ఇటు ప్రయాణికులకు, అటు చోదకులకు చుక్కలు చూపిస్తున్నాయి.

నిబంధనలు తుంగలో తొక్కి..
నగరంలో నిత్యం రోడ్డెక్కుతున్న క్యాబ్‌లు సుమారు లక్ష, రోడ్లపై తిరుగుతున్న అద్దె వాహనాలు కూడా కమర్షియల్‌ వాహనాల కిందికే వస్తాయి. మోటారు వాహన చట్టం (ఎంవీ యాక్ట్‌) ప్రకారం ఈ వాహనాల చోదకులకు తప్పనిసరి పనిగంటలు అమలు కావాలి. చోదకులు గరిష్ఠంగా విశ్రాంతితో కలిపి పదిగంటలు మాత్రమే పనిచేయాలి. అందులో పనిచేసేది ఎనిమిది గంటలైతే విశ్రాంతి రెండు గంటలు తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ మాత్రం క్యాబ్‌ డ్రైవర్లకు ఇన్సెంటీవ్స్‌ ఆశచూపి లక్ష్యాలు పెడుతున్నాయి. రోజుకి 15 నుంచి 18గంటలు పని చేయాల్సి వస్తోంది.

ఎంతడిగితే అంత ఇవ్వాల్సిందే..
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరవాసులు ఎక్కువగా క్యాబులను ఆశ్రయిస్తున్నారు. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్న క్యాబ్‌ నిర్వహణ సంస్థలు ఛార్జీలు రెట్టింపు చేశాయి. రూ.50 చెల్లించే చోట రూ.90 వసూలు చేస్తూ ప్రయాణికుడి పర్సు గుల్ల చేస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతుంటే అంత చెల్లించి గమ్యస్థానాల్ని చేరుతున్నారు ప్రయాణికులు. మరోవైపు పెంచిన రేట్లతో అటు ప్రయాణికుడు.. టార్గెట్లతో ఇటు డ్రైవరూ నష్టపోతున్నారు. ఇలా ఎక్కువ రైడ్లు చేసి తీసుకొచ్చిన సొమ్ము నుంచి ఒక్కో రైడుకు పెద్దమొత్తంలో కమీషన్లు తీసుకుంటున్నాయని ఓ సంస్థకు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ ‘ఈనాడు’తో తన ఆవేదన వెల్లబోసుకున్నాడు. దీంతో పాటు తాము క్యాబ్‌ నమోదు చేసుకునే సమయంలో నెలకు ఇంతా అని చెప్పి తర్వాత మాత్రం పలు కారణాలు చూపి తక్కువ చెల్లిస్తున్నారని వాపోయాడు.

సురక్షితమనే వెళ్లేది.. కానీ..!
రాజధానిలో క్యాబ్‌ల సంఖ్య రెండు లక్షల దాకా ఉంది. ఆటోలు వీటికంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రజల నమ్మకాన్ని క్యాబ్‌ నిర్వహణ సంస్థలు అలుసుగా భావిస్తున్నాయి. సమయపాలన పట్టించుకోకపోవట్లేదు. సరైన నిద్రలేక.. డ్రైవర్‌ తీవ్ర అలసటకు లోనవడంతో ప్రమాదాలు జరిగే అవకాశమూ లేకపోలేదు. ఓ సంస్థ ఇటీవలె క్యాబ్‌ డ్రైవర్లతో చేసిన సర్వేలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ సగటున రోజుకి పదిగంటలు పనిచేస్తే రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు సంపాదిస్తున్నాడు. ఇదే ఓటీ(ఓవర్‌టైం) పనిచేస్తే మరో రూ.500 పెరిగే అవకాశముంది. డబ్బులకు ఆశపడి డ్రైవర్లు ఓటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.